ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

Mar 6,2024 23:37
రానున్న సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో

ప్రజాశక్తి – కాకినాడ

రానున్న సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంత, ఆదర్శ వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా రాజకీయ పార్టీలను కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణ అంశాలపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ప్లయింగ్‌ స్క్వాడ్లు, నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల వ్యయం అకౌంటింగ్‌, ఎంసిఎంసి, నోడల్‌ అధికారుల విధులు, సి-విజిల్‌ యాప్‌ వినియోగం వంటి అన్ని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా ఎన్నికల విభాగం అధికారులు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి రాజకీయ పార్టీలు, పోటీలోని అభ్యర్థులు పాటించాల్సిన అంశాలను వివరించారు. అలాగే ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు, తొలగింపు దరఖాస్తుల పరిష్కారం, 18-19 సంవత్సరాల ఓటర్లు, కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ లు, రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు, ఇవిఎం, వివిప్యాట్‌ ల వినియోగంపైనా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యేవరకు అమల్లో ఉంటుందన్నారు. పబ్లిసిటీ నిమిత్తం వినియోగించే లౌడ్‌ స్పీకర్స్‌, వాహనాలకు రాజకీయ పార్టీ అభ్యర్థులు ముందుగానే అనుమతులు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరుగకుండా నియమావళిపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సమా వేశంలో డిఎల్‌డిఒలు పి.నారాయణమూర్తి, కెఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌రాజు వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు (వైసిపి), గదుల సాయిబాబా (టిడిపి), పెద్దిరెడ్డి రవికిరణ్‌ (బిజెపి) సబ్బారపు అప్పారావు (బిఎస్‌పి), వల్లూరి రామ్మోహన్‌(కాంగ్రెస్‌) కాళ్ళూరి కృష్ణమోహన్‌ (ఆప్‌) ఎన్నికల విభాగం టిడి ఎం.జగన్నాధం, తదితరులు పాల్గొన్నారు.

➡️