కిసాన్‌ పథకంలో రూ.36.33 కోట్లు జమ

Feb 28,2024 23:46
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రజాశక్తి – కాకినాడ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కిసాన్‌ పథకంలో మూడో విడతగా జిల్లాలో 1,80,609 మంది రైతుల ఖాతాలకు రూ.36.33 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం సిఎం జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతులకు మూడో విడత ఆర్ధిక సాయానికి సంబందించి బటన్‌ నొక్కారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లాలో అర్హులైన 1,80,609 మంది రైతులకు రూ.36.33 కోట్లను వారి ఖాతాలకు జమచేస్తూ మెగా చెక్కును రైతులకు అందజేశారు. అలాగే రూ.1లక్ష లోపు రుణాలకు, నిర్ణీత గడువులోపు చెల్లించిన 34,270 మంది రైతులకు వడ్డీ రాయితీ పరిహారం రూ.5.35 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేస్తూ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పిఎం కిసాన్‌ పథకంలో 2019 నుంచి 1,80,434 మంది రైతులకు రూ.1085.50 కోట్ల మేరకు పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. ఐదేళ్లలో మూడో విడతగా రూ.36.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించడం జరుగిందన్నారు. అదేవిధంగా 2021-22 రబీ, 2022 ఖరీఫ్‌లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 34,270 మంది రైతులకు రూ. 5.33 కోట్లు రైతులు తమ బ్యాంకు ఖాతాలో డిబిటి ఖాతాలో సొమ్ము జమ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బివిఎస్‌సి.హరి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్‌.మల్లికార్జునరావు, ఎపిఎంఐపి పీడీ జివివివి.ప్రసాదరావు, వ్యవసాయ అధికారులు గాయత్రి, లబ్దిదారు రైతులు పాల్గొన్నారు.

➡️