ద(మె)గా డిఎస్‌సి..!

Feb 3,2024 23:29
అధికారంలోకి రాకముందు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి యువత ఉపాధి కోసం అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సిని విడుదల చేస్తామని ప్రకటనలు గుప్పించారు. తీరా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన జగన్‌ సచివాలయ ఉద్యోగుల మినహా ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపానపోలేదు. ఎన్నికలకు ముందు డిఎస్‌సి అంటూ ప్రకటన ఇచ్చి మరోసారి ఆశలు రేపారు. తీరా ప్రకటించిన డిఎస్‌సిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కోతలు పెట్టడం నిరుద్యోగులను తీవ్ర నిరాశలోకి నెట్టారు.మెగా దగాఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే 23 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. తీరా సీఎం అయ్యాక ఆ హమీనే మరిచారు. అధికార పగ్గాలు చేపట్టి ఐదేళ్లు పూర్తికావస్తున్న తరుణంలో మరోసారి నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టుకునేందుకు 6,100 పోస్టుల భర్తీకి డిఎస్‌సిని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్‌సి పేరుతో తమను మరోసారి దగా చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో 21 వేలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2 వేల టీచర్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయితే జగన్‌ సర్కార్‌ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,100 టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు మమ అనిపించేలా కేబినేట్‌లో నిర్ణయించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్‌ఎ మొదటి లాంగ్వేజ్‌ 44, సెకండ్‌ లాంగ్వేజ్‌ 7, ఎస్‌ఎ ఇంగ్లీష్‌ 38, ఎస్‌ఎ మాథ్స్‌ 15, ఎస్‌ఎ పిఎస్‌ 4, ఎస్‌ఎ బిఎస్‌ 15, ఎస్‌ఎ ఎస్‌ఎస్‌ 12, ఎస్‌ఎ పిఇ 102 మొత్తంగా 237 పోస్టులను ఈ డిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్నారు. మెగా డిఎస్‌సి అంటూ ఐదేళ్ళుగా నిరుద్యోగులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం జిల్లాలో కేవలం తక్కువ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించి ఉసూరుమనిపించింది. గడిచిన ఐదేళ్లలో ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించకపోవడంతో కనీసం ఎన్నికల ముందైనా 20 వేల పోస్టులు భర్తీ చేస్తుందని నిరుద్యోగులు ఆశించారు. జిల్లాలో కనీసం 1500 పైనే పోస్టులు భర్తీ అవుతాయని భావించారు. అయితే డిఎస్‌సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా 6 వేల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్‌ ఐదేళ్లకు కలిపి 6,100 పోస్టులను భర్తీ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వేలమంది నిరుద్యోగులు డిఎస్‌సిపై ఆశలు పెట్టుకుని రూ.వేలల్లో డబ్బులు ఖర్చు చేస్తూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. కానీ అనుకున్న స్థాయిలో డిఎస్‌సి ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

➡️