ముద్రగడ పయనమెటు.?

Feb 13,2024 23:45
కాపు ఉద్యమనేత ముద్రగడ

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

కాపు ఉద్యమనేత ముద్రగడ రాజకీయం పయనం సందిగ్ధంలో పడింది. తాజాగా జనసేన వైపు అడుగులు వేయాలన్న ముద్రగడ ఆశలు నెరవేరే సంకేతాలు కనిపించడం లేదు. గోదావరి జిల్లాల్లోనే కాక ఎపిలోని సీనియర్‌ నేతల్లో ముద్రగడ పద్మనాభవం ఒకరు. చివరిగా 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2019లో పోటీ చేయకపోయినా పదేళ్ల తర్వాత 2024లో మళ్లీ బరిలో దిగే ఆలోచనలో ఉండడంతో ప్రస్తుతం ఆయన చుట్టూ చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ముద్రగడ తనయుడు ప్రకటించారు. తాను బరిలో ఉంటానని స్పష్టం చేశారు.కాపు ఉద్యమ నేతగా ముద్రగడకి రాష్ట్రమంతా గుర్తింపు ఉంది. అనుచరులు కూడా ఉన్నారు. కాపుల్లో బలం ఉందన్న అంచనాతోనే వివిధ పార్టీలు ఆయన మద్ధతు ఆశిస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే పరంపరలో ముద్రగడ చేరిక తమకు బలాన్ని చేకూరుస్తుందనే ఉద్దేశంతో తొలుత వైసిపి మంతనాలు జరిపింది. కానీ అవి ఫలించినట్టు కనిపించడం లేదు. జనసేన నేతలు పలు ధపాలుగా చర్చించడంతోపాటు రాష్ట్ర నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ లాంటి వారు ముద్రగడతో మాట్లాడారు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌కు ఆయన నేరుగా లేఖ రాశారని ఆ విధంగా త్వరలోనే పవన్‌ వచ్చి ముద్రగడను కలుస్తారని వెల్లడించారు. జనవరి నెలాఖరులాగా పవన్‌తో సమావేశం కాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ముద్రగడ కూడా తన అనుచరులతో సమావేశం నిర్వహించి త్వరలోనే పవన్‌ కిర్లంపూడి రాబోతున్నారన్న విషయాన్ని తెలిపారు. దీంతో ఇరువురూ ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వస్తే అటు రాజకీయంగా కీలక పరిణామం అవుతుందని అంతా భావించారు. దానికి తగ్గట్టుగా జిల్లాలో జనసేన ముద్రగడ చేతులు కలిపే విషయాన్ని ఆహ్వానిస్తూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయ్యింది. కానీ తీరా చూస్తే ఈ పరిణామాల్లో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా ఇద్దరి మీటింగ్‌కు అవకాశం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ ముద్రగడ వద్దకు రాలేకపోతున్నారని సమాచారాన్ని ఇప్పటికే ఆయన అనుచరులు చేరవేసినట్లు చెబుతున్నారు. కాపు ఉద్యమ నేతగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా పేరొందిన ముద్రగడతో భేటీకి పవన్‌ ఎందుకు డుమ్మా కొట్టారనే చర్చ సాగుతోంది. తొలుత కిర్లంపూడి రావడానికి అంగీకరించి, వస్తున్నానని సమాచారం కూడా ఇచ్చి బహిరంగంగా ప్రకటించిన తర్వాత పవన్‌ ఇలా తన నిర్ణయాన్ని మార్చుకోవడంపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన రాజకీయ వారసుడి కోసం చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిని గిరిబాబు ఏ పార్టీలో బరిలో ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ముద్రగడ గడచిన రెండు నెలలుగా పర్యటిస్తూ అనేకమంది నాయకులను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తులో భాగంగా ముద్రగడ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు బరిలో ఉండే అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. లేదంటే గతంలో బరిలో దిగిన పిఠాపురం నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. తీరా చూస్తే ఇప్పుడు జనసేనతో ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడంతో ముద్రగడ రాజకీయ పయనానికి అవకాశాలు సన్నగిల్లుతున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల బిజెపిలో చేరబోతున్నట్టు కూడా ఆయనపై ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పద్మనాభం ఏ పార్టీలో చేరతారు? వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తారా? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి..

➡️