సిఎఎను సమ్మతించే పార్టీలను వ్యతిరేకించాలి

Mar 30,2024 23:14
పౌరసత్వ సవరణ చట్టాన్ని

ప్రజాశక్తి – కాకినాడ

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే పార్టీలను దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా సదస్సు పిలుపు నిచ్చింది. శని వారం స్థానిక యుటిఎఫ్‌ హోమ్‌లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘సిఎఎ – దాని పర్య వసానాలు’ అనే అంశంపై వేదిక కన్వీనర్‌ సీనియర్‌ సిటిజన్‌ అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులోఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు పి.ప్రసాద్‌(పిపి) మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశ ప్రజలందరినీ దోషులుగా నిలిపి మత ప్రాతిపదికన నిర్దోషిత్వాన్ని తేల్చుకోవాలని చేస్తున్న కుట్రల వెనుక ఉగ్రవాద మతజాఢ్యం ఉందని విమర్శంచారు. ప్రపంచం ఆరాధించే రాముడ్ని రాజ కీయ రాముడుగా ఎన్నికల సిత్రాలు సృష్టించి సమున్న తంగా ఉన్న మతంలో భిన్న వర్గాలు సృష్టించడం రాజకీయ ప్రకోపంలో భాగంగా ఉందన్నారు. ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి చిస్టీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వలన రాజ్యాంగంలో లౌకికత్వానికి తావు లేదనే ధోరణి తీసుకు వస్తున్నారని అన్నారు. సిఎఎను సమ్మతించే పార్టీలను మద్దతుగా నిలిచే అనుబంధ పార్టీలను దేశ సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణంగా వ్యతి రేకించాలని కోరారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్తా రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్పూర్తితో భారత రాజ్యాంగాన్ని అనుసరించి మత అహంకా రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమయ్యిందని అన్నారు. సీనియర్‌ న్యాయవాది జవహర్‌ ఆలీ ఇజాజుద్దీన్‌ మాట్లాడుతూ 75ఏళ్ల దేశ స్వాతంత్య్రంలో కలిసివున్న సమ సమాజంలో ఇటు వంటి దుష్పరిణామాలు ఏర్పడతాయని ఊహించ లేదన్నారు. మతాల నడుమ, కులాల మధ్య సంఘీ భావం లేకుంటే ప్రగతి సాధ్యం కాదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా ఉందని సదస్సు తీర్మానించింది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీ బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, ఆమ్‌ ఆద్మీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జల్లూరి వేంకటేశ్వర్లు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సబ్బతి ఫణీశ్వరరావు, చింతపల్లి అజరు కుమార్‌, టి.రాజా, పి.శ్రీనివాసరావు, మలసాని శ్రీనివాసరావు, గంగాసూరిబాబు, నజీరుద్దీన్‌, దూసర్ల పూడి రమణరాజు పాల్గొన్నారు.

➡️