తడారుతున్న తాండవ

Apr 17,2024 22:39
తాండవ రిజర్యాయర్‌లో

ప్రజాశక్తి – కోటనందూరు

తాండవ రిజర్యాయర్‌లో నీటిని నిల్వలు ఘనణీయంగా తగ్గిపోయాయి. దీంతో తాండవ రిజర్వాయర్‌ ప్రధాన ఏటి కాలువ ఎండిపోయింది. దీంతో నీటి ఎద్దడితో మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాండవ రిజర్వాయర్‌లో నీటి నిలువలు తగ్గిపోయాయి. రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం 380 అడుగులు కాగా ప్రస్తుతం 355.6 అడుగులు మాత్రమే ఉందనితాండవ రిజర్వాయర్‌ డిఇ పి.అనురాధ తెలిపారు. గత నాలుగు నెలల కాలం నుంచి వర్షాలు కురవకపోవడం, ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోయాయని తెలిపారు. తాండవ రిజర్వేయర్‌ ఆనుకుని ఉన్న ప్రధాన ఏటి కాలువ ద్వారా నీటి ప్రవాహం ఉండేదని, ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో నీటి ప్రవాహం ఉండటంతో పశువులను మోపేందుకు ఆ చుట్టుపక్కలకే రైతులు తొలుకెళ్లేవారు. అయితే ప్రస్తుతం కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో పశువులకు తాగునీరు లేక ఇబ్బందుల తప్పడం లేదని రైతులు సూరిబాబు నాగరాజు, ఎర్రపాత్రుడు వాపోయారు. కాలువు ఎండిపోవడంతో పశుగ్రాసం కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖ అధికారులు కాలువలోకి నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

➡️