ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

May 10,2024 22:55
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ప్రజాశక్తి-కాకినాడఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్‌ఒలు, అధికారులు తహశీల్దార్లు, ఎంపిడిఒలతో కలెక్టరేట్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ రోజు దగ్గరపడుతున్న నేపథ్యంలో చివరి 72 గంటలు, పోటీలో నిలిచిన అభ్యర్థులు శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన అనంతరం ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి బృందాల ద్వారా తనిఖీలు, మండల కేంద్రాల్లో ఇవిఎం, వివి.ప్యాట్‌ స్ట్రాంగ్‌ రూముల ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాల కల్పన, పోలింగ్‌ సిబ్బందికి భోజన, ఇతర వసతి, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల ఏర్పాట్లు వంటి అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా చివరి 72 గంటలు ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి బృందాలు అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రధానంగా క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో విస్తత తనిఖీలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం సాయంత్ర 6 గంటలతో పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు గడువు ముగియనుందన్నారు. ప్రచారం ముగిసిన అనంతరం ఎటువంటి నగదు, ఇతర ప్రలోభ వస్తువులు పంపిణీ జరగకుండా కళ్యాణ మండపాలు, సామాజిక భవనాలు, ఇతర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో, తహశీల్దారు కార్యాలయంలో తాత్కాలిక ఇవిఎంలు, వివి.పాట్స్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పోలింగ్‌ రోజున ఇవిఎంలలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా బెల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అంధులకు బ్రెయిలీ ఓటరు స్లిప్స్‌ పంపిణీ చేయాలన్నారు. ఎంపిడిఒలు మండల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్‌ సరఫరా, మరుగుదొడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని, ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసి ఒఆర్‌ఎస్‌, మందులు అందుబాటులో వుంచాలని ఆయన తెలిపారు. వికలాంగులకు ప్రత్యేకంగా వీల్‌ చైర్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్‌కు ముందు రోజు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో ప్రణాళిక ప్రకారం పోలింగ్‌ సామాగ్రిని పంపిణీ చేయాలన్నారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎటువంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లు ఎవరు మొబైల్‌ ఫోన్లు తీసుకురాకూడదన్నారు. పోలింగ్‌ రోజున ఎటువంటి సమస్యలు తలెత్తిన తమ పరిధిలోని సెక్టార్‌, మైక్రో అబ్జర్వర్‌ అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ విజయవంతంగా ముగించేందుకు అధికారులు సమన్వయంతో చేయాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, డిపిఒ కె.భారతి సౌజన్య, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జె.నరసింహ నాయక్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసు, కాకినాడ, పెద్దాపురం డిఎల్‌డిఒలు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

➡️