నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

Apr 17,2024 22:49
మే 13న జరగనున్న సాధారణ

ప్రజాశక్తి – కాకినాడ

మే 13న జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు కాకినాడ సిటీ నియోజకవర్గ ఆర్‌ఒ జె.వెంకటరావు తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 29వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరణ ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తా మన్నా రు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతానికి 100 మీటర్ల విస్తీర్ణంలో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థితోపాటు ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తా మన్నారు. ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని, ఫారం-2బి, ఫారం-26లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. వేసిన నామినేషన్లు, అఫిడవిట్‌లలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే 26వ తేదీ స్క్రూట్నీ లోపుగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థులు తమ బి ఫారాలను 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు స్థానికంగా ఓటు లేకపోతే ఓటు ఉన్న ప్రాంతంలోని ఆర్‌ఒతో ధృవీకరించిన పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే 10 రూపాయలు బాండ్‌ పేపర్‌పై ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు రూ.5వేలు, ఇతర అభ్యర్థులు రూ.10వేలు చొప్పున డిపాజిట్‌ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర సమాచారం కోసం నామినేషన్లు స్వీకరించే ప్రాంతం వద్దే హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే సదరు హెల్ప్‌ డెస్క్‌ వద్ద మరింత సమాచారాన్ని పొందవచ్చునన్నారు. డిప్యూటీ కమిషనర్‌ గుంటూరుశేఖర్‌, ఎఆర్‌ఒ చల్లన్నదొర, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లు నాయుడు, సిహెచ్‌ అనిల్‌కుమార్‌, పవన్‌ పాల్గొన్నారు.

➡️