ఎస్.బి.ఐ వద్ద సిపిఎం నిరసన

Mar 11,2024 15:03 #Kakinada

ప్రజాశక్తి – పెద్దాపురం : ఎన్నికల బాండ్ల సేకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకు ద్వారా సేకరించిన ఎన్నికల బాండ్లు వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించకుండా వాయిదాల పేరుతో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం స్థానిక ప్లీడర్ల వీధిలోని భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం ఎదురుగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ ఒత్తిడి మేరకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల వివరాలు వెల్లడించడానికి జాప్యం చేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తుల నుండి ఎన్నికల బాండ్ల పేరుతో బిజెపి సేకరించిన సొమ్ము వివరాలు ఎన్నికలు ముగిసే అంతవరకు తెలియకుండా ఉండడానికే ఈ నాటకాలు ఆడుతున్నారన్నారు. ఇటువంటి బాండ్ల సేకరణ కొనసాగితే కార్పొరేట్ శక్తుల కనుసన్నలలో ప్రభుత్వాలు పాలన సాగిస్తాయన్నారు. వెంటనే ఎన్నికల బాండ్ల వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దారపురెడ్డి సత్యనారాయణ, రొంగల వీర్రాజు, కూనిరెడ్డి అప్పన్న, నెక్కల నరసింహమూర్తి, ఆర్ అరుణ్, క్రాంతి కుమార్, జగదీష్, శివ, చింతల సత్యనారాయణ, చల్లా విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

➡️