భవన కార్మికులపై అక్రమ కేసు కొట్టివేత

May 10,2024 22:51
భవన కార్మికులపై అక్రమ కేసు కొట్టివేత

ప్రజాశక్తి-కాకినాడ13 మంది భవన నిర్మాణ కార్మికులపై పెట్టిన తప్పుడు కేసును శుక్రవారం కాకినాడ మొబైల్‌ కోర్టు కొట్టివేసింది. ఇసుక సమస్యను పరిష్కరించి, ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన భవన నిర్మాణ కార్మికులు, సిఐటియు నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. వైసిపి అధికారంలోకి రాగానే నూతన ఇసుక పాలసీ పేరుతో ఇసుక తవ్వకాలు, అమ్మకాలను మూడు నెలల పాటు నిషేధించడంతో నిర్మాణరంగంపై ఆధారపడిన రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలు ఉపాధి దొరక్క, అప్పులు పుట్టక కుటుంబాలను పోషించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా 25 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇసుక త్వరగా విడుదల చేయాలని ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10 వేల జీవన భతి కల్పించాలని కోరుతూ ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు అప్పటి మంత్రి కన్నబాబు ఇంటికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించారని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌ కుమార్‌ తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడ్డారని, పబ్లిక్‌ను ఆటంకపరిచారని, కన్నబాబు ఆస్తులు ధ్వంసం చేశారనే ఆరోపణలకు నిరూపణ కాలేదని కాకినాడ మొబైల్‌ కోర్టు కేసుని కొట్టివేసిందని తెలిపారు. ఆకలి మంటలతో సహాయం చేయాలని అర్ధించిన కార్మికుల పట్ల జగన్‌ ప్రభుత్భం ఇంత నిర్బంధాన్ని పాల్పడడాన్ని కార్మికులు గమనించి జరుగుతున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌ స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్సులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది మహ్మద్‌ జవహర్‌ ఆలీకి, వారి జూనియర్లు కె.దుర్గా భవానీకి, ఆనంద్‌, కె.నాగజ్యోతికి ధన్యవాదలు తెలిపారు.

➡️