తాగునీటి సమస్యపై ఎన్నికల బహిష్కరణ

May 12,2024 22:45
తాగునీటి సమస్యపై ఎన్నికల బహిష్కరణ

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు తాగునీరు ఇవ్వడంలో అలసత్వం వహిస్తుందడటం వల్ల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెం గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో ఒక్క మంచినీటి బావి కూడా లేదన్నారు. పక్కనున్న కాలువలో కూడా మురికి నీరు తప్ప కనీసం వాడుకునే నీరు కూడా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. చాలాకాలంగా ట్యాంకుకు ఎక్కే మంచినీటి పైప్‌ లైన్లు ఎక్కడికక్కడ లీకులవుతున్నాయని అధికారులు దృష్టికి తీసుకు వెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందువల్లనే ట్యాంకుకు నీరు ఎక్కడం లేదన్నారు. ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి కూడా కనీసం కాల కృత్యాలు తీర్చుకోడానికి కూడా నీరు లేకపోవడంతో అక్కడి ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సిబ్బంది బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఒక్క రోజుకే ఎన్నికల సిబ్బంది మంచినీటి ఏర్పాట్ల కోసం నరకం చూస్తుంటే ప్రతిరోజూ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసు కోవచ్చన్నారు. సంబంధిత మండల అధికారికి ఫోన్‌ చేసినా రెస్పాండ్‌ కాక పోవడంతోనే ఎన్ని కలను బహిష్క రిస్తున్నట్టు నాగులపల్లి వైస్‌ సర్పంచ్‌ చిరంజీవి, గ్రామస్తులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని, లేకపోతే సుమారు 600 ఓట్లు తమ గ్రామంలో ఉన్నాయని వాటిని బహిష్కరిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామానికి మంచినీరు ఇవ్వడంలో అలసత్వం వస్తున్న అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుని గ్రామానికి మంచినీరు అవసరమైనంత వరకు అందిస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.

➡️