ప్రమాదపు అంచుల్లో ఉపాధి కూలీలు

Apr 29,2024 22:58
రోజు లేచింది మొదలు రోడ్డుపై ఏ ప్రమాదం

ప్రజాశక్తి – తాళ్లరేవు

రోజు లేచింది మొదలు రోడ్డుపై ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అటువంటి ఈ రోజుల్లో కాయకష్టం చేసే కూలికి భద్రత లేకుండా పోయింది. ఉపాధి కూలీలకు పని ప్రారంభంలో ఒక ఫోటో తీస్తున్నారు. పని పూర్తయిన తర్వాత రెండో ఫోటో తీస్తున్నారు. ఉపాధి పని ముగిసిపోయిన రెండో ఫోటో కోసం ఉపాధి కూలీలు వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎటువంటి నీడ సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు రోడ్డుపైనే మండుటెండల్లో జీవనం సాగిస్తున్నారు. మండలంలోని లచ్చిపాలెం పంచాయతీలో నడిరోడ్డుపై ఉపాధి కూలీలు వేచి ఉన్న సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 216పై ఉన్న డివైడర్‌పై మండుటెండలో కూర్చుని ఉపాధి కూలీలు వేచి ఉండడాన్ని ‘ప్రజాశక్తి’ క్లిక్‌ మనిపించింది. డివైడర్‌పై కూర్చున్న కూలీల మీదకి ప్రమాదవశాత్తు ఏదైనా వాహనం అదుపు తప్పితే ఎంత ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. నిలువ నీడ లేక ప్రమాదపు అంచుల్లో ఉపాధి కూలీలు జీవనయానం సాగిస్తున్నారు. దీనిపై ఉపాధి కూలీలను ప్రశ్నించగా పని వద్ద టెంట్లు ఏర్పాటు చేయలేదని, నీడ లేక రోడ్డుపైన కూర్చున్నామని తెలిపారు. లచ్చిపాలెం పరిధిలోని ఊట కాలువ పూడికతీత పనిలో భాగంగా సుమారు 42 మంది సోమవారం పనికి హాజరు కాగా, మిగిలిన కొందరు రోడ్డు చెంతనే నిలబడి ఉండడం గమనార్హం. సంబంధిత అధికారులు కూలీలకు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా ఉపాధి పని కల్పించడం శోచనీయం. ఉపాధి కూలీల దయనీయతకు ఇది నిదర్శనం.

➡️