ఆయిల్ అక్రమ చౌర్యం

May 24,2024 11:57 #Kakinada

  ట్యాంకర్ సీజ్ 

ప్రజాశక్తి – తాళ్లరేవు: పుదుచ్చేరి రాష్ట్రమైన యానాం ప్రాంతం నుంచి యదేచ్ఛగా ఆయిల్ అక్రమ అక్రమ చౌర్యం నిరంతరంగా జరుగుతుంది. ఎప్పుడో ఏడాదిలో ఒకసారి ఒకటి రెండు సార్లు అధికారులు అరకొరగా దాడులు నిర్వహించి తూతూ మంత్రంగా ఫైన్ విధించి వదిలేస్తున్నారు. దీంతో నిరంతరం అక్రమ చౌర్యం జరుగుతూనే ఉంది. దీనికి ఉదాహరణ గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరక యానం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు వేల లీటర్ల తో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులతో సంయుక్తముగా కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలోని పోలేకుర్రు గ్రామ సమీపములో అశోక్ లేలాండ్ ఆయిల్ ట్యాంకర్ వాహనాన్ని నిలుపుదల చేసి తనిఖీ చేయగా, ఆ ఆయిల్ ట్యాంకర్ లో 4000 లీటర్ల డీజిల్ ను గుర్తించారు. ఆ డీజిల్ ను, డ్రైవర్ గోవల సుబ్బారావు ను అదుపులోకి తీసుకున్నారు. యానాంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో లీటరుకు రూ. 84లకు కొనుగోలు చేసి మోటార్ , పైపు సహాయముతో అశోక్ లేలాండ్ ఆయిల్ ట్యాంకర్ వాహనాన్ని వేరొక వాహనంలోకి లోడు చేస్తుండగా పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ ట్యాంకర్ కమ్ టాటా ఏస్ వాహనం యజమాని అడ్డాల వీర వెంకట సత్యనారాయణ ఆ డీజిల్ ను తాళ్లరేవుకు రవాణా చేసి అక్కడ గల చేపలు, రొయ్యల చెరువుల మోటార్ ఇంజిన్లకు లీటరుకు రూ. 88 లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. అక్రమంగా రవాణా చేస్తున్న డీజిల్ సుమారు రూ. 8,39,000 లు విలువ ఉంటుందని అన్నారు. డీజిల్ ను, అశోక్ లేలాండ్ ఆయిల్ ట్యాంకర్ ను తాళ్లరేవు సివిల్ సప్లయ్స్ అధికారులు, సీజ్ చేసి సంబందిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎమ్.ఎస్. ఓ. ప్రసన్న శుక్రవారం తెలిపారు. ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు జగన్నాధరెడ్డి, లక్ష్మీనారాయణ, డి.ఎస్.ఓ ప్రసాద్, సి.ఎస్.డి.టి లక్ష్మీప్రసన్న, ఏ.ఎస్.ఓ రామణలక్ష్మి దేవి లోవరాజు, శివ పాల్గొన్నారు.

➡️