జియో ట్యూబ్‌ ధ్వంసం

May 19,2024 22:38
అలల తాకిడికి ఉప్పాడలో

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

అలల తాకిడికి ఉప్పాడలో నిర్మించిన జియో ట్యూబ్‌ సముద్ర గర్భంలో కలిసిపోవడంతో మత్స్యకార గృహాలు కోతకు గురవుతున్నాయి. రూ.14 కోట్లతో నిర్మించిన జియో ట్యూబ్‌ నిర్వహణ లేకపోవడంతో సముద్రపు అలల తాకిడికి ధ్వంసం అయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కోతకు గురవుతున్న ఉప్పాడ గ్రామాన్ని రక్షించాలఅనే లక్ష్యంతో 2008లో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జియో ట్యూబ్‌ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టింది. అమీనాబాద్‌ సమీపం నుంచి ఉప్పాడ శివారు వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర జియో ట్యూబ్‌ను నిర్మాణం చేపట్టింది. దీంతో అలల తాకిడికి ఉప్పాడ గ్రామం కోతకు గురికాకుండా నిలిచింది. అయితే కొన్ని సంవత్సరాలుగా జియో ట్యూబ్‌ నిర్వహణను అధికార యంత్రాంగం గాలికి వదిలేయడంతో కాలక్రమీనా జియో ట్యూబ్‌ ధ్వంసం అయ్యింది. దీంతో అలల తాకిడికి మత్స్యకార గృహాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. విపత్తులు సంభవించినప్పుడు సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో కొనపాపేట, ఉప్పాడలో వందలాది గృహాలు సముద్రంలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. గృహాలే కాకుండా ఆలయాలు, ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం సముద్రంలో ఇప్పటికే కలిసిపోయాయి. తుపాన్లు సంభవించినప్పుడు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తుపాను సమయంలో అధికారులు, రాజకీయ నాయకులు హడావిడి చేస్తూ తీర ప్రాంతాలను పర్యటిస్తూ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని హామీలను గుప్పించడం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే కోత నివారణకు చర్యలు చేపట్టడం శూన్యమని పలువురు వాపోతున్నారు.

ధ్వంసం అవుతున్న బీచ్‌ రోడ్డు

ఉప్పాడ కాకినాడ బీచ్‌ రోడ్డు అలల తాకిడికి ధ్వంసం అవుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బీచ్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని ప్రజాప్రతినిధులు చెప్పడం తప్ప ఆచరణలో నిధుల సంగతి తేల్చడం లేదు. జిల్లా కేంద్రమైన కాకినాడకు చేరుకోవడానికి ఉప్పాడ కాకినాడ బీచ్‌ రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు బీచ్‌ రోడ్డులోనే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఉప్పాడ నుంచి నేమం సమీపం వరకు బీచ్‌ రోడ్డు ధ్వంసం కావడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రయాణం సాగిస్తున్నారు. ఏ మాత్రం ఆదమరచి ప్రయాణం చేసినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అలల తాకిడిని నివారించేందుకు రక్షణగా రాళ్లు వేయడంతో సముద్రుం ఉగ్రరూపం దాల్చినప్పుడు బీచ్‌ రోడ్డుపైకి రాళ్లు చేరుతున్నాయి. మరోపక్క భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సాగరమాల పేరుతో ప్రస్తుతం ఉన్న బీచ్‌ రోడ్డును గాలికి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో మాదిరిగానే కొనపాపేట నుంచి నేమం సమీపం వరకు జియో ట్యూబ్‌ నిర్మాణం చేపట్టాలని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

➡️