కూటమి బలాన్ని చాటిచెబుదాం: నానాజీ

May 5,2024 23:05
వైసిపి అసమర్థ పాలనతో

ప్రజాశక్తి – కరప, కాకినాడ రూరల్‌

వైసిపి అసమర్థ పాలనతో కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిం దని,ఐదేళ్ల వైసిపి అరాచకులకు ముగింపు పలికి, కూటమి బలాన్ని చాటి చెబుదామని జనసేన కాకినాడ రూరల్‌ నియోజకవర్గ అభ్యర్థి పంతం నానాజీ పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడ రూరల్‌ రేపూరు గ్రామం నుంచి రోడ్‌ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోడ్డు షోకొవ్వాడ, గంగనాపల్లి గ్రామాల్లో జోరుగా సాగింది. కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన్ను గజమాలతో సత్కరించారు. రోడ్‌ షోతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎల్‌ఎ కన్నబాబుకు పరిశ్రమల్లో వాటాలు దండుకోవడం, దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం చేత కాదన్నారు. ఐదేళ్లలో క్షేత్రస్థాయి పర్యటన లేదని, కనీస మౌలిక సదుపాయాలు లేక రూరల్‌ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కారణంగా ప్రధాన ఎజెండాగా మౌలిక సదుపాయాలు, యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ త్యాగాల ఫలితమే కూటమిని, ఈ కూటమి బలంతో వైసిపిని అంతం చేయాలన్నారు. జగన్‌ రాక్షస పాలనను అంతం చేయడానికి ఓటు అనే ఆయుధాన్ని ధరించి, రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్నారు. గుమ్మడి మేనిఫెస్టోతో ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, యువతీ, యువకులు పెద్ద ఎత్తున మహిళలు జనసేన పార్టీలోనికి చేరడం శుభసూచికమన్నారు.కూటమి ప్రభుత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు ఆరో నెంబర్‌ గల గాజు గ్లాస్‌కు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రూరల్‌ ఎలక్షన్‌ కోఆర్డినేటర్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.జనసేనలో పలువురు చేరిక పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి కాకినాడ రూరల్‌లో జనసేన పార్టీలోనికి వేలాదిగా తరలివస్తున్నారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. నేమాం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు రేవు రాజు ఆధ్వర్యంలో పలువురు వైసిపి కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.కాకినాడ రూరల్‌ 3వ డివిజన్‌ శెట్టిబలిజ పేట ప్రాంతానికి చెందిన వైసిపి నాయకుడు కట్ట సత్తిబాబు నాయకత్వంలో పలువురు వైసిపికి రాజీనామాలు చేసి పంతం నానాజీ స్వగృహంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి పంతం నానాజీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️