అమలు కాని హామీలు

May 20,2024 22:11
జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి

ప్రజాశక్తి – యు. కొత్తపల్లి

జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సెజ్‌ కోసం 10 వేల ఎకరాలను సేకరించారు. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మండలంలో శ్రీరాంపురం, పొన్నాడ గ్రామ పంచాయితీల పరిధిలోని 12 గ్రామాల నుంచి ఈ భూములను సేకరించింది. వీరి కోసం కొత్తమూలపేటలో 967 గృహాలతో నిర్వాసిత కాలనీని ఏర్పాటు చేసింది. ప్రారంభంలో సుమారు 600 కుటుంబాలు పునరావాస కేంద్రానికి తరలివెళ్లాయి. అనంతరం దఫదఫాలుగా పూర్తి స్థాయిలో బాధితులంతా పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అప్పట్లో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి జాబ్‌కార్డుతో పాటు, పునరావస కేంద్రానికి తరలివెల్లేందుకు ఒక్కో కుటుంబానికి రూ.66,250 అందించారు. ఉన్న ఇంటిని, సొంత ఊరును వదిలివెళ్లిన బాధితులకు ఉపాధి కరువైంది. చేసేది లేక బాధితులు రోడ్డెక్కారు. దీంతో ఒక్కో బాధిత కుటుంబానికి జీవనభృతి కోసం రూ.52 వేలు చొప్పున కెఎస్‌ఇజెడ్‌ అధికారులు అందించారు. ఏళ్లు గడుస్తున్నా ఉపాధి మాత్రం కల్పించలేదు. అధికారులు ఇచ్చిన జాబ్‌ కార్డులకు విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సెజ్‌ను జిఎంఆర్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో నిర్వాసితులు తము ఉపాధి కల్పించాలని ఉద్యమించారు. 2012, 2013లోనూ ఆందోళనలు చేశారు. ఆందోళన చేసినప్పుడల్లా సెజ్‌ అధికారులు బాధితులకు నచ్చచెబుతూ కాలం వెళ్లబుచ్చుతూనే ఉన్నారు. 2017లోనూ బాధితులు మరోమారు ఉద్యమించారు. దీంతో గతంలో జాబ్‌ కార్డులు వచ్చిన వారితోపాటు, కొత్తగా ఇవ్వాల్సిన వారికి జాబ్‌ కార్డులు ఇస్తామని వారికి ఉద్యోగాలు కల్పిస్తామని మరోసారి హామీలు ఇచ్చారు. కాలం గడుస్తున్నా నేటికీ ఇవి అమలు కాలేదు.

నిర్వాసితుల కుటుంబాలు రెట్టింపు…

పునరావాస కేంద్రానికి వచ్చే సమయంలో 967 బాధిత కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో వివాహాలు జరిగి కొత్త తరం కూడా వచ్చేసింది. దీంతో బాధిత కుటుంబాల సంఖ్య రెట్టింపు అయ్యింది. పునరావాస కాలనీలోనే ప్రస్తుతం 2,019 మంది ఓటర్లు ఉన్నారు. నాడు నిర్మించిన గృహాల్లోనే రెండు మూడు కుటుంబాలు కాపురాలు ఉండాల్సిన పరిస్థితి. భూములు ఒకరి చేతుల్లోంచి మరోకరి చేతుల్లోకి మారుతున్నాయి తప్ప వీరికి న్యాయం జరిగిన దాఖలాలు లేవు.

కాలనీలో వసతులు కరువు

పునరావాస కాలనీలో కనీస వసతులు కూడా కరువయ్యాయి. బాధితులను కాలనీకి తరలించడంలో అధికారులు చూపిన చొరవ వారికి వసతులను కల్పించడంలో మరిచారు. కాలనీ ప్రజల ఇబ్బందులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నాడు సెజ్‌, నిన్న జిఎంఆర్‌, నేడు అరబిందో యాజమాన్యాలు వీరి పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. కాలనీలోని పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మద్యం, గంజాయి, గుట్కా సేవించడానికి, ఇతర కార్యకలాపాలకు దీనిని వినియోగించుకుంటున్నారని కాలనీవాసులు చెబుతున్నారు.

ఉపాధి కరువాయే..

సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఊర్లను ఖాళీ చేయించిన అధికారులు నేడు ఆ బాధితులకు ఉపాధి కల్పించేందుకు చొరవ చూపడం లేదు. భూములు ఉన్నప్పుడు కూలీనాలీ చేసుకుని జీవించేవారమని, పునరావాస కాలనీకి వచ్చిన తరువాత కూలి కూడా దూరమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన జాబ్‌ కార్డులు నేడు నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగపడటం లేదని వాపోతున్నారు. తాము ఏ గ్రామంలోనూ లేకపోవడంతో ఉపాధి హామీ పనులు కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరావాస కాలనీ పట్ల వివక్ష

పునరావాస కేంద్రం పట్ల అరబిందో యాజమాన్యం వివక్షతను ప్రదర్శిస్తుంది. పునరావస కాలనీని మరిచి ఇతర గ్రామాలను అభివద్ధి చేస్తుంది. కొనపాపపేట, యండపల్లి, ఉప్పాడ, అమీనాబాద్‌ తదితర గ్రామాలకు అరబిందో యాజమాన్యం నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తుంది. కాని పరిశ్రమల కోసం భూములిచ్చిన వారిని మరచింది. ఉపాధి లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. తక్షణమే మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

-మాతా సత్తిబాబు, సెజ్‌ బాధితుడు

➡️