కాకినాడ రూరల్‌లో ముగిసిన పోలింగ్‌

May 13,2024 23:24
కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌, కరప

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కాకినాడ రూరల్‌, కరప మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 41 గ్రామాల్లో 264 పోలింగ్‌ కేంద్రాల్లో 2లక్షల 69 వేల 330 ఓటర్లు ఉండగా పోలింగ్‌ సమయం ముగిసేసరికి ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 1లక్ష 82 వేల 176 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు.ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నానికి నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఓటర్లు పోల్‌ చీటీలతోపాటు గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకుని ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు దీరారు. పోలింగ్‌ సంద ర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు గట్టి బందో బస్తును ఏర్పాటు చేశారు. నడవలేని వారిని, వయోవృద్దులను కొందరు ప్రత్యేకంగా వీల్‌ చైర్లలో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయిం చి తీసుకువెళ్ళారు. ఎన్నికల నిర్వ హణకు ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఈసారి అధికారులు సుందరంగా తీర్చి దిద్దారు. ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, మహిళా పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేక అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. తాగునీటి వసతితోపాటు నీడ కోసం షామీయానాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల కోసం కొన్ని కేంద్రాల్లో కార్పెట్‌ కూడా పరిచి ఉంచారు. 6 గంటల తర్వాత కూడా లైన్‌లలో ఉన్న ఓటర్లను ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. కరప మండలంలోని అరట్లకట్ట, నడకుదురు, కాకినాడ రూరల్‌ లోని కొన్నిచోట్ల ఇవిఎంలు మొరాయించటంతో ఓటర్లు క్యూ లైన్‌లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా 67. 64 శాతం ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారి ఇట్ల కిషోర్‌ తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలంలో వాకలపూడి పోలింగ్‌ కేంద్రాలు 30,31 భారీగా క్యూలైన్లో జనం ఉండడంతో అధికారులు నెంబర్లను పంపిణీ చేశారు. రూరల్‌ మండలం సూర్యరావుపేట పంచాయతీ, హైస్కూల్‌ వద్ద ఆరుగంటల తర్వాత లోపల బారులు తీరిన ఓటర్లుకు సమయం సుమారు రాత్రి 11 గంటలు సమయంలో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.

➡️