యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

Apr 11,2024 23:45
యువత డాక్టర్‌

ప్రజాశక్తి – తాళ్లరేవు

యువత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పి. మల్లవరం పంచాయతీ రాంజీ నగర్‌ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని అమలాపురం ఎంపి చింతా అనురాధ, కాకినాడ లైఫ్‌ లైన్‌ ఆసుపత్రి అధినేత కోరుకొండ భానుమతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దేశ ప్రజల కోసం అంబేద్కర్‌ చేసిన త్యాగాలను వివరించారు. ఆర్థిక సమానత్వం ఉంటేనే రాజకీయ సమానత్వం సాధించ గలమని, అది విద్య ద్వారానే సాధ్యమవు తుందన్నారు. ప్రతి తల్లి, తండ్రి తన చిన్నారులను ఉన్నత చదువులు చదివించాలన్నారు. తల్లిదండ్రులు విద్యా ర్థులకు ఇవ్వ వలసింది సెల్‌ ఫోన్లు కాదని, ప్రతి గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పుస్తకాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుత పాలన విధానంలో భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగు తుందని, ప్రజలంతా జాగరూకతతో ఉండాలని అన్నారు. బహుజనులంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని తెలిపారు. తొలుతగా ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాంజీ నగర్‌ గ్రామ పెద్దలు యడ్ల కుటుంబరావు, ఎంపిపి రాయుడు సునీత, ఎఎంసి చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, దున్న జనార్ధన రావు, బి. బుల్లిరాజు, రాయుడు గంగాధర్‌, ధూళిపూడి బాబి, పంపన రామకృష్ణ, పాల్గొన్నారు.

➡️