జిల్లా ప్రతిష్టను పెంచిన కట్టా నరసింహులు

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తెలుగు సాహిత్యం, జిల్లా చరిత్రలపై ఎంతో మమకారం ఉన్న విద్వాన్‌ కట్టా నరసింహులు కైఫియత్తుల పరిష్కారం ద్వారా మరుగున పడిన గొప్ప చరిత్రను వెలికితీసి జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశారని యోగి వేమన పాలక మండలి సభ్యులు, వ్కె.ఎస్‌.ఆర్‌. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి అన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయ తొలి బాధ్యులు, కడప కైఫియత్తుల పరిష్కర్త విద్వాన్‌ కట్టా నరసింహులు 3వ వర్ధంతిని పురస్కరించుకొని రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన రాజు ఆధ్వర్యంలో బుధవారం ఆయన సంస్మరణ సభను నిర్వహించింది. తొలుత విద్వాన్‌ కట్టా చిత్రపటానికి పూలమాల అలం కరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లా డుతూ సాహిత్యం కంటే కట్టా చరిత్ర పరిశోధనపై కషిచేశారని, కైఫియత్తుల పరిష్కారంతో ఆయనకు తెలుగునాట విశేషమైన పేరు ప్రతిష్టలు లభించా యన్నారు. పోతన సాహిత్య పీఠం ఏర్పాటుతో పాటు ఒంటిమిట్టకు ప్రభుత్వ లాంఛనాలు దక్కేందుకు ఆయన చరిత్ర పరిశోధన ఎంతో ఉపయోగప డిందన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయంతో పాటు ఆయనకు బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్టలతో విడదీయలేని అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు డాక్టర్‌ తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ విద్వాన్‌ కట్టా నరసింహులుకు జిల్లా రుణపడి ఉందని, ఆయనకెంతో ఇష్టమైన బ్రౌన్‌ గ్రంథాలయ ఆవరణలో బ్రౌన్‌ శాస్త్రి సరసన ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సమంజసంగా ఉంటుందన్నారు. రాయలసీమ టూరిజం సంస్థ ప్యాట్రన్‌ పద్మప్రియ చంద్రారెడ్డి, జానమద్ది నాగరాజు మాట్లాడుతూ కడప కైఫియత్తుల పరిష్కారం అనితర సాధ్యమని, ప్రతిభగల ప్రతివారిని విద్వాన్‌ కట్టా ఎంతో ఆత్మీయంగా ప్రోత్సహించేవారని ఆయనలేని లోటు తీర్చలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెల్లాల వేంకటేశ్వరాచారి, చిత్రకారుడు వెంకటేష్‌, మధు, డేవిడ్‌, గొబ్బూరి కోటేశ్వరరావు, జ్యోతి జార్జి పాల్గొన్నారు.

➡️