బిజెపి, టిడిపి, వైసిపిలను తరిమి కొట్టండి

బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీతారాం ఏచూరి, చత్తీస్‌ఘడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్మా, తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, అభ్యర్థులు లోతా రామారావు, పి.అప్పలనర్స, సిపిఎం, సిపిఐ కాంగ్రెస్‌ ఎపి, తెలంగాణ రాష్ట్రాల నాయకులు

సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

కూనవరం బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా పలువురు వక్తలు పిలుపు

ప్రజాశక్తి – రాజమండ్రి ప్రతినిధి, కూనవరం విలేకరి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపిని, దానితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని, ఐదేళ్లుగా అంటకాగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని తరిమికొట్టాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సిపిఎం అరకు ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు సహా అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అల్లూరి జిల్లా కూనవరం మండల పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. భారీ బైక్‌ ర్యాలీ, ఆదివాసీలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాలలో రాజ్యాంగ పునాది స్తంభాలపై మోడీ ప్రభుత్వం దాడికి తెగబడిందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే భారత దేశానికి అమృత కాలం వస్తుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కుంట నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్మా మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విలీన మండలాల్లో ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టుల సొంతమని చెప్పారు. సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ తన ఎపి పర్యటనల్లో అమరావతిలో రాజధాని గురించి గానీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి గానీ కనీసం నోరు మెదపలేదన్నారు. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన మోడీతో జతకట్టి చంద్రబాబు, జగన్‌ పార్టీలు ఏం ఉద్దరిస్తాయని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంపై పోటాపోటీగా ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు జగన్మోహన్‌ రెడ్డి పార్టీలు పోలవరం నిర్వాసితుల గురించి కనీసం స్పందించిన దాఖలాలు లేవన్నారు. నిర్వాసితులకు పునరావాస నిధులు, పొలానికి పొలం, ఇంటికి ఇల్లు ఎర్రజెండాతోనే సాధ్యమని చెప్పారు. అరకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం ప్రజలు తనను గెలిపిస్తే పోలవరం నిర్వాసితుల గళాన్ని అసెంబ్లీలో వినిపించి పోరాడి నిధులు తీసుకొస్తానని చెప్పారు. కమ్యూనిస్టులను విమర్శించే నైతిక అర్హత అనంత బాబుకు లేదన్నారు. గడిచిన 40 ఏళ్లలో అనంత బాబు, అతని తండ్రి అడ్డతీగలకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్స మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైసిపి అభ్యర్థులు గెలిచినప్పటికీ ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఏనాడూ నోరుమెదిపిన దాఖలాలు లేవన్నారు. సహజ వనరులను అదాని, అంబానీలకు దోచిపెట్టి ఏజెంట్లగా మారిపోయారని విమర్శించారు. తునికాకు, ఉపాధి హామీ, ఆదివాసీ చట్టాల పరిరక్షణ, జీవో నెంబర్‌ 3, పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం ప్రశ్నించి గొంతుకులైన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించిన ఏకక పార్టీ సిపిఎం మాత్రమేనని తెలిపారు. ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో అనేకసార్లు పోలవరం నిర్వాసితుల సమస్యలపై పాలక పక్షాన్ని ప్రశ్నించామని, ఇక్కడ ఓట్లతో గెలిసిన ఎమ్మెల్సీ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రశ్నించిన దాఖలాలు లేవని చెప్పారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ విలీన మండలాల్లో జెండాలు ఏవైనా అజెండా ఒకటే కావాలన్నారు. బహిరంగ సభకు హాజరైన వారందరూ ఇతర పార్టీల కార్యకర్తలతో సైతం చర్చించి సిపిఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరావు, మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు రావులపల్లి రవి, కల్లూరు వెంకటేశ్వర్లు, తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌ అస్మతుల్లా, సిపిఎం భద్రాది కార్యదర్శి ఏ.కనకయ్య, బండారు రవికుమార్‌, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ సుకుమా నాయకులు బి.రాజు, ఉంగా, ప్రజానాట్యమండలి అధ్యక్షులు మంగరాజు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్‌, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️