ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

Feb 8,2024 16:56

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-అమలాపురం

లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణం లో పారదర్శకంగా సాగేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌ సత్తిబాబు స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్‌ నందు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిడిఒలతో సమావేశం నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బంది వివరాలు సేకరణకు సంబంధించి విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 010 పద్దు నుంచి జీతభత్యాలు డ్రా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ, ఉద్యోగ వ్యక్తిగత వివరాలు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్‌ మేనేజ్మెంట్‌ సిస్టం పోర్టల్‌ నందు నమోదు చేయించుకోవాలని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల్లో పోలింగ్‌ విధులైన ప్రిసైడింగ్‌ అధికారి సహాయ పెసైడింగ్‌ అధికారి ఇతర పోలింగ్‌ సిబ్బంది కోసం గెజిటెడ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల వివరా లను, ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పిపిఎంఎస్‌) పోర్టల్‌లో నమోదు విధి విధానాలపై నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ కు చెందిన డిఐఓ సుబ్బారావు శాస్త్రీయ, సాంకేతికపరమైన అవగాహనను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పెంపొందించారన్నారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పక్షంలో ఎన్నికల సంఘం తీసుకునే చర్యల కు బాధ్యులు కావలసివస్తుందన్నారు. జిల్లాలో ఉద్యోగుల సమగ్ర సమాచారం పి పి ఎమ్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను స్థానిక కలెక్టరేట్లో 10 కంప్యూటర్లు సహాయంతో నిర్వహిస్తారన్నారు. తప్పనిసరిగా స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చి డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుందని ప్రతి శాఖకు డేటా ఎంట్రీ కొరకు సమయాలను నిర్దేశించి ఆ యొక్క షెడ్యూల్‌ నివేదికలను ఆయా శాఖలకు ముందుగా పంపడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో సంబంధిత శాఖ సిబ్బంది వివరా లతో హాజరై డేటా ఎంట్రీ చేయించు కోవాలన్నారు. ఈ డేటా ఎంట్రీ లో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి నివాస ప్రాంతం, మండలం, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో ఎన్నికలు విధులు నిర్వహించిన వివరాలను నమోదు చేయాలని సూచించారు, కాంట్రాక్టు పొరుగు సేవల సిబ్బందిని డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు ప్రకారం జూన్‌ 30, 2024 లోపు రిటైర్డ్‌ అయ్యే గెజిటెడ్‌ ఉద్యోగులను డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదన్నారు ఒక ఫారంలో సిఎఫ్‌ఎంఎస్‌ వివరాలతో నింపాలని, రెండో ఫారంలో ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని నింపాలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సూపరింటెండెంట్‌ టి.వైద్యనాథ్‌ శర్మ, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️