గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణపై సమీక్ష

Feb 23,2024 16:49

సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-అమలాపురం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఆదివారం జరిగే గ్రూప్‌-2 రాత పరీక్ష నిర్వహణపై స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్‌ నందు అధికారులతో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2 రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయ వంతంగా నిర్వహించాలని రూట్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపర్వైజర్లుకు సూచించారు. జిల్లావ్యాప్తంగా 10,788 మంది అభ్యర్థులు గ్రూప్‌-2 ఎపిపిఎస్‌సి రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. వీరికి 33 కేంద్రాల్లో 475 రూములు పరీక్షలు రాసేందుకు వీలుగా ఎంపిక చేశారన్నారు. రాత పరీక్ష నిర్వహణ కొరకు 11 రూట్‌ లుగా విభజించడం జరిగిందన్నారు. ప్రతి కళాశాల ప్రిన్సిపల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌గా అదే కళాశాల్లో వ్యవహరిస్తారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 528 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందన్నారు. 25వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారన్నారు. అదేవిధంగా 33 మంది లైజన్‌ అధికారులను నియమించామన్నారు. పోలీసులు ప్రశ్నాపత్రాలు తరలింపు భద్రత, పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతలు పర్య వేక్షించాలన్నారు. ట్రాన్స్‌కో అధికారులు పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని సూచించారు. సిసి కెమెరాలు నిఘాలో పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించాలన్నారు. రూట్‌ అధికారులు ప్రశ్నావళి పత్రాలను భద్రత నడుమ కేంద్రాలకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఎపిసిఎస్‌సి సెక్షన్‌ అధికారులు శంకర్రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

➡️