‘పొన్నాడ’ జీవితం స్ఫూర్తిదాయకం : డాక్టర్‌ సీతారామారావు

Jan 24,2024 23:02

పొన్నాడ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు

ప్రజాశక్తి-రాజోలు

సీనియర్‌ న్యాయవాది, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు జీవితం స్పూర్తిదాయకమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ కె.సీతారామారావు అన్నారు. బుధవారం రాజోలులో గాంధీ హౌస్‌లోని హనుమంతరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన హనుమంతురావు కాంస్య విగ్రహన్ని, పొదలాడకు చెందిన కవి, కథకుడు, జీవిత చరిత్రకారుడు ఎంఎస్‌ సూర్యనారాయణ రచించిన ‘జ్ఞాన గుణవంతా..జయ హనుమంతా..పొన్నాడ జీవన ప్రస్థానం’ పుస్తకాన్ని డాక్టర్‌ సీతారామారావు ఆవిష్కరించారు. న్యాయవాది వాడ్రేవు పాపాయి పంతులు అధ్యక్షతన హనుమంతురావు ప్రథమ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ సీతారామారావు మాట్లాడుతూ హనుమంతరావు అరవై ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో సేవలందించిన ఆయన అనేక చట్టాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలుగులో అనువాదం చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి విధేయు డిగా ఉంటూ రాజోలు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారన్నారు. రాజోలు సర్పంచ్‌గా పలు కాలనీల్లో ఇళ్ల స్థలాలను ఉచితంగా అందజేశారని అన్నారు. హనుమంతరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన కుమారులు పొన్నాడ సూర్యప్రకాష్‌, సూర్యరావులను పలువురు అభినందించారు. రాజోలు పుర ప్రముఖులు, బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు హనుమంతరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ అడ్వకేట్‌ వాడ్రేవు పాపయ్య పంతులు, పొన్నాడ సూర్యారావు, పొన్నాడ సూర్యప్రకాశ్‌, పొన్నాడ ఎస్‌ఆర్‌వివి.సూర్యారావు, పిసిసి సభ్యుడు రుద్రరాజు గోపాలకష్ణంరాజు పలువురు పాల్గొన్నారు.

 

 

➡️