ఒకటిన అందని పింఛన్లు

Apr 1,2024 15:49 #Konaseema
  • వృద్ధులు ఎదురుచూపు
    3 నుండి పంపిణీకి ఏర్పాట్లు

ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు ఏప్రిల్ ఒకటిన పింఛన్ల కోసం ఎదురుచూసి సొమ్ములు అందకపోవడంతో పలువురిని ఆరా తీస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ప్రకారం వాలంటీర్లను విధులనుండి పక్కన పెట్టడంతో పింఛన్లు పంపిణీకి సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని ఆదేశాలు అందాయి. దీనికి తోడు ఏప్రిల్ కొట్టిన బ్యాంకులకు సెలవు రావడంతో ఇప్పటివరకు పింఛన్లకు సంబంధించిన సొమ్ములు ఆయా పంచాయతీలకు ఇంకా చేరలేదు. దీంతోపాటుగా వాలంటీర్లు వద్ద ఉన్న పింఛన్దారుల వివరాలు సచివాలయంలో అందజేసి వారు విధులు నుండి తప్పుకోవడంతో సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లేదా మూడో తేదీన సొమ్ములు చేతికి అందిన తర్వాత పింఛన్ల పంపిణీ జరుగుతుంది పంచాయతీ అధికారులు వివరించారు. అదేవిధంగా పింఛన్లను ఇంటికి వెళ్లి ఇవ్వకూడదని నిబంధనలు ఉండడంతో గ్రామ సచివాలయాలకు లేదా పంచాయతీలకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని సూచించారు. అయితే లేవలేని వృద్ధులకు పై అధికారులు సూచనల మేరకు పింఛన్లు అందజేయడం జరుగుతుందని ద్రాక్షారామ గ్రామ కార్యదర్శి వి సుబ్రహ్మణ్యం ప్రజాశక్తికి వివరించారు. పింఛన్లకు వచ్చే వృద్ధులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాలని, పెన్షన్ పాసుబుక్కుపై ముఖ్యమంత్రి ఫోటో ఉండటంతో వాటిని తీసుకురాకూడదని తెలియజేశారు. పలుచోట్ల పింఛన్ల పంపిణీ ఒకటో తేదీన జరగకపోవడంతో కొన్ని ప్రభుత్వాలు లేదా కొందరు నాయకులు అడ్డుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్నికల తంతు ముగిసే వరకు పింఛన్లను పంపిణీ విధానం గ్రామ సచివాలయాల ద్వారానే జరగనుండడంతో వృద్ధులు వికలాంగులకు మూడు నెలల పాటు ఈ విధానం వల్ల ఇక్కట్లు తప్పవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వీలైనంత త్వరగా పింఛన్లు అందజేయాలని వృద్ధులు వికలాంగులు కోరుతున్నారు.

➡️