చెరువులు నింపేందుకు చర్యలు : కలెక్టర్‌

Apr 8,2024 22:54

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా): కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని జిల్లాలో అన్ని చెరువులు నింపుటకు పటిష్ట చర్యలు చేపట్టి, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్లో తమ ఛాంబర్‌ లో ఆర్డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, మత్స్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కాలువల ద్వారా విడుదల చేస్తున్న నీటిని తాగునీటి చెరువులు నింపుటకు తీసుకుంటున్న చర్యలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న కాలువ శివారు మండలాలు పెడన, కత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం రూరల్‌, నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి చెరువులు నింపుటకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాలన్నారు. పహార బందాలు కాలువల ద్వారా విడుదల చేస్తున్న నీటిని మధ్యలో ఆక్వా చెరువులకు అనధికార మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించడం అరికట్టాలని, శివారు ప్రాంతాలకు చేరేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా నీటిని మళ్లించినట్లు తెలిస్తే డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ యాక్ట్‌ కింద చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. తాగునీటి చెరువులను నూటికి నూరు శాతం నింపాలన్నారు. గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపే బాధ్యత పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లదే అన్నారు. ఇప్పుడు తాగునీటి చెరువులు నింపుతున్నందున, మే నెలాఖరు వరకు తాగునీటికి సమస్య ఉండదన్నారు.ఈ సమావేశంలో డ్వామా వీడి జీవి సూర్యనారాయణ డిపిఓ నాగేశ్వర నాయక్‌, మచిలీపట్నం, గుడివాడ, తాడిగడప మున్సిపల్‌ కమిషనర్లు బాపిరాజు, బాలసుబ్రమణ్యం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️