తాగునీటి చెరువులన్నీ నూరు శాతం నింపాలి : కలెక్టర్‌

Apr 16,2024 23:05

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య నివారణకు గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి చెరువులన్నీ నూరు శాతం నింపాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తాగునీరు, విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి సి ఎస్‌ గారి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితులు, తాగునీటి చెరువుల నింపే కార్యక్రమం గురించి సీఎస్‌ గారికి వివరించారు. అనంతరం కలెక్టర్‌ ఇరిగేషన్‌, ఆర్డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ కాలువల ద్వారా వస్తున్న నీటిని గ్రామాల్లో తాగునీటి చెరువులు, పట్టణాల్లో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు పూర్తిస్థాయిలో నింపాలన్నారు.ఈనెల 6వ తేదీ నుండి కాలువలకు నీటి విడుదల చేయడం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 150 చెరువుల వరకు 70 -80 శాతం వరకు నింపినట్లు అధికారులు కలెక్టర్కు నివేదించారు. మరో నాలుగు రోజులు కాలువల ద్వారా నీటి సరఫరా ఉంటుందని ఇరిగేషన్‌ అధికారులు కలెక్టర్కు నివేదించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు 90 వేల నుండి లక్ష మంది వరకు పనులకు వస్తున్నారని అధికారులు కలెక్టర్‌ కు నివేదించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్‌ ఈఈ శివప్రసాద్‌, డిపిఓ నాగేశ్వర నాయక్‌, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, మచిలీపట్నం, ఉయ్యూరు మున్సిపల్‌ కమిషనర్లు బాపిరాజు, పి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్‌ డి ఈ మురళి, పాల్గొన్నారు.

➡️