కమ్యూనిస్టుల హయాంలోనే పేదలకు ఇళ్లపట్టాలు

Apr 25,2024 23:18
  • సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు

ప్రజాశక్తి-విజయవాడ

పేదల ఇళ్ల కోసం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని, గతంలో కార్పొరేటర్‌గా స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత సిపిఎం, కమ్యూనిస్టులకే దక్కిందని ఇండియా వేదిక బలపరిచిన సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్ధి చిగురుపాటి బాబూరావు అన్నారు. గురువారం 25వ డివిజన్‌ అరండల్‌పేట, కూర్మయ్య వంతెన సెంటర్‌ ప్రాంతాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ స్థానిక సమస్యలను ప్రజల వద్ద నుంచి తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచినీరు దుర్వాసన వస్తుందని, అవి కూడా సరిగా రావడం లేదని, చెత్త పన్ను భారం ఎక్కువైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ దశాబ్దాలు గడిచినా సంజీవయ్య కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని, నగరాన్ని ఇన్నాళ్లు పాలించిన పాలక పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు వారి సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్ప, పేదలకు పట్టాలి ఇవ్వటానికి అభ్యంతరం చెబుతున్నారని ధ్వజమెత్తారు. నగర పరిధిలో కాలువ కట్టలపై స్టార్‌ హోటల్స్‌ బార్లు, పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారని,పేదలకు మాత్రం అనేక వంకలు చెప్పి పట్టాలివ్వకుండా కాలయాపన చేయటం దుర్మార్గమని పేర్కొన్నారు. ధరలు పెంచిన మోడీతో జతకట్టిన టిడిపి, జనసేన నిత్యావసర ధరలు అరికడతామని చెప్పటం మరో పెద్ద మోసమన్నారు. అటు కేంద్రంలో బిజెపి ధరలు పెంచితే, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పన్నుల భారాలు వేసి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. విజయవాడ నగరంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ఇతర ఇండియా వేదికలోని పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు కెవి భాస్కరరావు మాట్లాడుతూ సెంట్రల్‌ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసే సిపిఎం అభ్యర్ధికి ప్రతిఒక్కరూ ఓటు వేయడం ద్వారా తమ ఓటుకే విలువ పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత విశ్వేశ్వరరావు, మెడికల్‌ రిప్స్‌ మాజీ నాయకులు రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.వి.ఆంజనేయులు, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, మాజీ కార్పొరేటర్‌ కాజా సరోజా, నాయకులు వై.సుబ్బారావు, లక్ష్మణ, మహేష్‌, వెలగా శీను తదితరులు పాల్గొన్నారు.బాబూరావు సతీమణి ప్రచారంఅజిత్‌ సింగ్‌నగర్‌: సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో సిపిఎం అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు సతీమణి చిగురుపాటి సునంద గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబూరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఆండ్ర మాల్యాద్రి, మన్యం నాగార్జున, మురారి, దుర్గ, ఫాతిమా, భాగ్యమ్మ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️