జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలి

May 18,2024 17:28 #Library

మానికొండ గ్రంథాలయ అధికారి ఎల్‌.హరికృష్ణ
ప్రజాశక్తి-గన్నవరం
ప్రతి విద్యార్థి నాటి జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలంలోని మానికొండ గ్రంథాలయ అధికారి ఎల్‌.హరికృష్ణ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మానికొండ గ్రంథాలయం తరపున విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. శనివారంనాడు విద్యార్థులకు ‘గ్రంథాలయాల విశిష్టత-పుస్తక పఠనం ఆవశ్యకత’పై ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ, సుభాష్‌చంద్రబోష్‌, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, పొట్టి శ్రీరాములు తదితరులు తమ కోసం కాకుండా దేశం, సమాజం కోసం పనిచేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు మంచి ఉత్తమ గుణాలను అలవర్చుకోవటం, మంచిగా చదువుకోవటం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన జాతీయ నాయకుడి వ్యక్తిత్వం గురించి తోటి విద్యార్థులకు తెలియజేయటం ద్వారా మంచి ఆదర్శభావాలు అలవడతాయన్నారు. గణితంలో పజిల్స్‌, సుడోకు, చదరంగం , క్యారమ్స్‌ వంటి మనో ఉల్లాసం కలిగించే ఆటలు నిర్వహించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గని ఉత్సాహంగా గడిపారు.

➡️