ప్రజా సమస్యలు పట్టని పార్టీలను నిలదీయండి: విమలక్క

Apr 23,2024 23:18

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌

ప్రజా సమస్యలు పట్టని పార్టీలను ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు నిలదీయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉభయ తెలుగు రాష్ట్రాల చైర్‌పర్సన్‌ విమలక్క అన్నారు. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఏప్రిల్‌ 14 నుండి మే 5 వరకు 20 రోజులు పాటు సాగుతున్న జన చైతన్య యాత్ర మంగళవారం మచిలీపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా కోనేరు సెంటర్లో జరిగిన కార్యక్రమంలో విమలక్క మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ ఆనాటి కేంద్ర ప్రభుత్వం శ్రీకష్ణ కమిటీ నివేదిక ఆధారంగా అనేక హామీలు ఇచ్చిందని, తదుపరి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం హామీలేమీ అమలు చేయలేదన్నారు. ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కరువైపోయాయన్నారు. మచిలీపట్నం, దివిసీమ తదితర ప్రాంతాల భూములకు సాగునీరు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. సమస్యలపై పార్టీలను నిలదీయడంతో పాటు ఎన్నికల అనంతరం ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకుల వీరాంజనేయులు, నాగేంద్రరావు దుర్గారావు, ఎఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఖరీం బాషా, బి.రమేష్‌, అంజిబాబు, మల్సూర్‌, సుధాకర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️