కోనేరు సెంటర్లో పోలీస్‌ సిబ్బందిచే మాక్‌ డ్రిల్‌

May 23,2024 16:52 #Krishna district, #mak drill, #police

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) : సార్వత్రిక ఎన్నికలు -2024 ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. హింసాత్మక చర్యలు చోటు చేసుకున్న సమయంలో తీసుకునే చర్యలపై ఆర్ముడ్‌ రిజర్వు పోలీస్‌ సిబ్బంది కోనేరు సెంటర్‌ సర్కిల్‌ వద్ద ”మాబ్‌ ఆపరేషన్‌”మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. జిల్లా ఎస్‌ఫి అద్నాన్‌ నయీం అస్మి, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్‌పి ఎస్‌విడి ప్రసాద్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ జరిగిన ఈ మాక్‌ డ్రిల్‌ను ఎస్‌బి సీఐ జేవీ రమణ లీడ్‌ చేశారు. ఒకవైపు నిరసనకారులు ప్లకార్డులు చేతపట్టి, అల్లరి మూకలు మరోవైపు. వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్‌ చేయుటకు మైక్‌ ద్వారా మొదటగా వార్నింగ్‌ ఇవ్వడం, అది వినకపోతే మెజిస్ట్రేట్‌ అనుమతితో భాష్ప వాయువు ప్రయోగించుట, లాఠీ చేతపట్టి చార్జ్‌ చేపట్టుట, అంతకి పరిస్థితి అదుపులోనికి రానిపక్షంలో ఆ తర్వాత ఫైర్‌ డిపార్ట్మెంట్‌ వారితో వాటర్‌ కెనాన్‌ వారిపై ప్రయోగించుట, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ ఫైరింగ్‌, అయినప్పటికి పరిస్థితి అదుపులోకి రాక పోతే ఫైరింగ్‌ చేయుట, ఫైరింగ్‌ లో గాయపడిన వారిని అంబులెన్స్‌ సహాయంతో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడం వంటివి డెమో ద్వారా ప్రజలందరికీ పూర్తిగా అర్థమయ్యేలా ఎండని సైతం లెక్కచేయకుండా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎస్‌పి అద్నాన్‌ నయీం అస్మి మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిమూకలను అణచి వేసేందుకు, జన సమూహాలను నిలువరించుటకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. ప్రజలందరి సహకారంతో ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా ముగిసిందని, జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రజలందరూ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని, ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని విద్రోహర చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️