కురువ మహా సింహ గర్జన వేదిక ముస్తాబు

Dec 23,2023 19:53

ఏర్పాట్లను పరిశీలిస్తున్న శశికళ కృష్ణమోహన్‌, సంఘం పెద్దలు

ప్రజాశక్తి-ఆలూరు
ఎన్నికలకు మూడు నెలలు వ్యవధి ఉండడంతో ఆలూరులో ఎన్నికల వేడి పుంజుకుంటుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు కులసంఘ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్‌ శశికళ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో మాదాసి, మాదారి కురువలు మహా సింహగర్జన చేపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, జిల్లాలో ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కురువ సామాజికవర్గం ఐకమత్యం కోసం ఆలూరు డిగ్రీ కళాశాల ఆవరణలో కురువ మహా సింహ గర్జన సభ ముస్తాబైంది. ఈ సభకు రాష్ట్రంలోని కురువ సంఘం పెద్దలు హాజరవుతున్నట్లు తెలిసింది. సభ విజయవంతానికి శశికళ, ఆమె భర్త కృష్ణమోహన్‌, సంఘం పెద్దలు 20 రోజులుగా నియోజకవర్గంలో పర్యటించి, కుల బాంధవులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం, మాదాసి, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్‌ లాంటి సమస్యలను పరిష్కరించాలని మహాసభ వేదికగా డిమాండ్‌ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా మాదాసి, మాదారి కురువలు మెజార్టీగా ఉండడం వల్ల ఏ పార్టీ అయితే సీట్లు కేటాయిస్తారో వారిని బలపరచాలనే ఆలోచనతో కులసంఘ నాయకులు ముందుకు వెళ్తున్నారు. కురువ సంఘం నాయకులు చేపట్టే మహా సింహగర్జనతో తమ సీటుకు ఎక్కడ చేటు వస్తుందోనని కొంతమంది ప్రజాప్రతినిధులు అనుకొంటున్నట్లు సమాచారం.

➡️