ముఖ్యమంత్రి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం

Jan 6,2024 20:11

కౌతాళంలో మాట్లాడుతున్న రాధాకృష్ణ

– సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ
ప్రజాశక్తి – కౌతాళం
అంగన్వాడీల వేతనాలు పెంచకపోతే విజయవాడలోని ముఖ్యమంత్రి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ హెచ్చరించారు. శనివారం కౌతాళంలో అంగన్వాడీల సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. కౌతాళంలో మారుమూల గ్రామాల వారు సైతం ఎవరికీ భయపడకుండా సమ్మెలో పాల్గొనడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇక్కడ కూడా కొంతమంది అంగన్వాడీలను భయపెట్టించాలని చూసినా అంగన్వాడీలు భయపడకుండా ధైర్యంగా వారికి బుద్ధి చెప్పారని తెలిపారు. ప్రాజెక్టు ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మల్లయ్య, మండల కార్యదర్శి మేళిగిరి ఈరన్న, సిఐటియు కోసిగి రాముడు పాల్గొన్నారు. పెద్దకడబూరులో తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని అంగన్వాడీలు ప్రార్థనలు చేశారు. స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు, మసీదులో, సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జయమ్మ, చిట్టెమ్మ, సుకన్య, శారద, రత్నమ్మ, అరుణ పాల్గొన్నారు.

➡️