హైకోర్టు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు :  తహసీల్దార్ శ్రీధర్ మూర్తి

Jun 20,2024 17:36 #Kurnool

ప్రజాశక్తి – మంత్రాలయం : మండల పరిధిలోని సౌలహళ్లి గ్రామంలో నెలకొన్న భూమి సమస్య పై హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీధర్ మూర్తి హెచ్చరించారు. గురువారం సౌలహళ్లి గ్రామానికి చెందిన ఆరు వర్గాల వారు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన్ను కలిసి కోర్టు ఆదేశాల పత్రాలను చూపించారు. ఈ సందర్భంగా గ్రామ విఆర్వో రాజును భూమి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని హరిజన నరసన్న భార్య ముత్తమ్మ పేర పై ఉన్న సర్వే నెంబరు 90/బి1ఎ లో 2.89 ఎకరాల భూమిని 1999లో ఇళ్లు లేని పేదలకు సుమారు 70 మందికి నివాస స్థల పట్టాలను పంపిణీ చేశారని ఊరికి దూరంగా ఉండడం వల్ల అక్కడికి ఎవరూ వెళ్లకపోవడంతో హరిజన ముత్తమ్మే సాగు చేసుకుంటుందని, గత 2015 నుంచి లబ్ధిదారులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా భూమి మాది అంటూ హరిజన ముత్తమ్మ హైకోర్టు కు వెళ్లిందని తెలిపారు. ఈ విషయం పై హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత భూమి పై 144 సెక్షన్ ఉందని చెప్పారు. లబ్ధిదారులు కూడా హైకోర్టుకు వెళ్లారని వారికి అనుకూలంగా తీర్పు రాగా మళ్లీ హరిజన ముత్తమ్మ హైకోర్టు కు వెళ్లి 8 వారాల పాటు ఆ భూమిలో ఎవరూ అడుగు పెట్టరాదని తీర్పు వచ్చిందని అది జులై మొదటి వారానికి పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయం పై స్పందించిన తహసీల్దార్ ఇరు వర్గాల వారు తగాదాలకు వెళ్ళకుండా ఉండాలని ప్రస్తుతం ఆ భూమి రగడ పై 144 సెక్షన్ ఉందని ఎలాంటి అలజడి సృష్టించినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కారించే దిశగా ఆలోచించాలని కోరారు. ఇరు వర్గాల పై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు.

➡️