రైతులను ఆదుకోవడంలో వైసిపి విఫలం

Dec 18,2023 19:52

మహాసభలో మాట్లాడుతున్న రామకృష్ణ

– వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించాలి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం పట్టణంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్‌, షరాఫ్‌ బజార్‌, సోమేశ్వర సర్కిల్‌, ట్యాంకు బండ్‌, కూరగాయల మార్కెట్‌ మీదుగా సోమప్ప సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్కిల్‌లో రైతు సంఘం జిల్లా నాయకులు పంపన గౌడ్‌ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రామకృష్ణ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో దివాలాకోరు ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కరువు, కాటకాలతో వేలాది ఎకరాలు నష్టపోయి రైతులు కష్టాలను మూటగట్టుకుని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కనీసం స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ కరువు సహాయక చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ను కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలవలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులనే కలవని ముఖ్యమంత్రి, ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కెవివి.ప్రసాద్‌ మాట్లాడుతూ… జిల్లాలో కరువు మండలాలను ప్రకటించినప్పటికీ ఇంతవరకు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కేంద్ర కరువు పరిశీలన బృందం పర్యటించి రోజులు గడుస్తున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటివరకు వెల్లడించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల బాధలను పట్టించుకుని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీరెడ్డి, జగన్నాథం, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప, పట్టణ కార్యదర్శి రంగన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్‌, రామకృష్ణారెడ్డి, అజరు బాబు, శ్రీరాములు, కారుమంచి, విరుపాక్షి, రాజసాహెబ్‌ పాల్గొన్నారు.

➡️