వైసిపి పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు

Dec 23,2023 19:54

మాట్లాడుతున్న ఎపి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌

– టిడిపితోనే ముస్లింల అభివృద్ధి
– ఎపి శాసన మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
వైసిపి పాలనలో మైనారిటీలకు రక్షణ లేదని, టిడిపితోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమని ఎపి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్‌ హాలులో టిడిపి ముస్లిం, మైనారిటీ సెల్‌ ఎమ్మిగనూరు తాలూకా ఆధ్వర్యంలో మైనారిటీల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983 కంటే ముందు హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేవారని, ఎన్‌టిఆర్‌ వచ్చాక ముస్లింలకు రక్షణ కల్పించారని తెలిపారు. అలాగే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని తెలిపారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని, నంద్యాలలో వైసిపి వేధింపులు భరించలేక ముస్లిం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడులో హజీరాబీని అత్యాచారం చేసి హత్య చేశారని, నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిందితులను గుర్తించి శిక్ష పడేటట్లు చూస్తామన్నారు. డిప్యూటీ సిఎం అంజాద్‌ బాష ఉత్సవ విగ్రహంలా ఉన్నారని, మైనారిటీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలపై దౌర్జన్యాలు చేస్తూ ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 40 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి, సామర్థ్యాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పారు. వైసిపిని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి, టిడిపి మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మాట్లాడారు. సామాజిక సాధికారత పేరుతో వైసిపి చెబుతున్న యాత్రలు జనం లేక అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయని తెలిపారు. ఇసుక, మద్యం, మైనింగ్‌, భూదందాలతో జగన్‌ రూ.లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. మైనారిటీల జీవన ప్రమాణాలు పెరగడానికి చంద్ర బాబు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. అనంతరం హజీరాబీ కుటుంభానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌ ఉసేన్‌, హజ్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ హసన్‌ బాషా, టిడిపి మైనారిటీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి షంశర్‌ ఖాన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్తాఫ్‌ ఉసేన్‌, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షులు అప్సర్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్‌, అధికార ప్రతినిధి ముస్తఫా, టిడిపి మైనారిటీ సెల్‌ తాలూకా అధ్యక్షులు హుసేన్‌ పీర, తురేగల్‌ నజీర్‌ అహ్మద్‌, కలీముల్లా, కాశీం వలీ, శాబీర్‌, సలాం, సలీం, బడేసాబ్‌, దాదావలీ, రషీద్‌, మాబు పాల్గొన్నారు.

➡️