రంగులపై ఉన్న శ్రద్ధ మొక్కలపై లేదు

May 24,2024 16:53 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రధాన రోడ్ల మధ్యలో ఆర్ సి సి గోడలు నిర్మించి వాటికి ఇరువైపులా అందమైన రంగులు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ అందులో వేసిన మొక్కలు ఎండిపోతుంటే వాటిని రక్షించడంపై లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని. పుల్లారెడ్డి, సివి వర్మ, పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు టి.హరికృష్ణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దిలేటి విమర్శించారు. శుక్రవారం పట్టణ పౌర సంక్షేమ సంఘం,పర్యావరణ పరిరక్షణ కమిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బృందం కొండారెడ్డి బురుజు నుండి రాజవిహార్, సి క్యాంపు కూడలి మీదుగా నంద్యాల చెక్పోస్ట్ వరకు పర్యటించారు.రూ కోట్లు ఖర్చు చేసి ఆర్సీసీ గోడలు నిర్మించి వాటి మధ్యలో మట్టి వేసి రూ లక్షల వెచ్చించి మొక్కలు వేశారన్నారు. కొండారెడ్డి బురుజు నుండి పాత కంట్రోల్ రూమ్ వరకు వేసిన మొక్కలు ఎండిపోగా వాటిని తొలగించారన్నారు.సి క్యాంపు కూడలి నుండి నంద్యాల చెక్పోస్ట్ వరకు వేసిన వందలాది మొక్కలు ఎండిపోయాయి. అందులో ఒక్క మోక్క మాత్రమే కనిపించిందని మిగతా మొక్కలన్నీ పూర్తిగా నేలమట్టవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మొక్కలు రూ 1000 నుండి 5వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది. పాత మట్టిని తీసి కొత్త మట్టి వేసి నాటిన మొక్కలు ఎందుకు ఎండిపోయాయి?సక్రమంగా నీళ్లు పోయెకనా? కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం మొక్కలు కొనుగోలు చేశారా? అనే విషయంపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు కాంట్రాక్టర్ల నుండి మొత్తం ఖర్చును వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో నగర నాయకులు కె. శ్రీనివాసులు, ఎన్. మద్దిలేటి, జి. లక్ష్మిరెడ్డి, కె. వెంకటరామిరెడ్డి,ఎస్. షాకీర్,ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️