చెత్తబుట్టలోకి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌

May 10,2024 23:31

మాట్లాడుతున్న జూలకంటి బ్రహ్మారెడ్డి
ప్రజాశక్తి – మాచర్ల :
ప్రజల ఆస్తులను దోచుకునే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టగానే చించి చెత్త బుట్టలో వేస్తానని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. మాచర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచార సభకు హాజరవ్వాల్సిన అయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయితే వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరాచకపాలన నడుస్తోందని, ఓటుద్వారా దీనికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా మూకుమ్మడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసి ఆయన్ను ఇంటికి సాగనంపాలన్నారు. కూటమి అధికారంలోకి రాగనే మహిళలకు ఉచితంగా ఆర్‌టిసి బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లును ఉచితంగా అందజేస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పారు. పెన్షన్‌ను రూ.4వేలకు పెంచి ఏప్రిల్‌ నుండి అమలు చేస్తామన్నారు. పేదలందర్నీ ధనవంతుల్ని చేస్తామని, వాలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. మాచర్ల ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మరెడ్డిని, నర్సరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులను గెలిపించాలని కోరారు. బ్రహ్మారెడ్డిని గెలిపిస్తే తన సొంత నియోజకవర్గమైన కుప్పంతో సమానంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ఆరాచక పాలన కొనసాగుతోందన్నారు. మద్యం, గ్రానెట్‌, భూమి, ఇసుక, గ్యాంబలింగ్‌ మాఫియాలతో పిన్నెల్లి సోదరులు రూ.వేలకోట్లు సంపాదించారని విమర్శించారు. ఆ డబ్బుతో ప్రజలను కొని తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, అయితే ప్రజల్ని కొనే స్థాయి అతనికి లేదని అన్నారు. డబ్బులతో ఓట్లు కొని గెలవాలనుకోవడం అతని భ్రమేనన్నారు. ఆ డబ్బంతా ప్రజల నుండి సంపాదించినదేనని, ఇస్తే తీసుకోని ఓటు మాత్రం టిడిపికి వేయాలని కోరారు. శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ గతాన్ని మించి అభివృద్ధిని ఈ ప్రాంతంలో చూపిస్తానన్నారు. వరికపూడిశెల ప్రాజెక్ట్‌తోపాటు ఇతర తాగునీటి పథకాలను పూర్తి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ టిడిపితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సభకు వస్తున్నారని చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు తరలిరాగా వీరిలో మహిళలు, యువత ఎక్కువగా కనిపించారు. కార్యక్రమంలో నాయకులు చిరుమామిళ్ల మధుబాబు, వై.కేశవరెడ్డి, విద్యాధరణి మురళి, వై.మల్లికార్జునరావు, కె.అనిల్‌కుమార్‌, కె.దుర్గారావు పాల్గొన్నారు.

➡️