దిబ్బలపాలెం సమీపాన చిరుత సంచారం?

May 17,2024 20:06

గ్రామస్తుల్లో ఆందోళన

పులిని చూసామంటున్న కొంతమంది యువకులు

ప్రజాశక్తి-భోగాపురం :  మండలంలోని దిబ్బలపాలెం సమీపాన చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత పులితో పాటు దాని పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వేలిముద్రలు కనబడడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. చేపల కంచచేరు పంచాయతీ దిబ్బల పాలెం గ్రామ సమీపంలోని విమానాశ్రయ నిర్మాణ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు గత ఐదు రోజులుగా ఆందోళన చెందుతున్నారు. అంతేకాక కొంతమంది యువకులు కూడా ఫులిని చూశామని చెబుతున్నారు. ఈనెల 13వ తేదీ రాత్రి దిబ్బల పాలెం గ్రామానికి చెందిన యువకుడు అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా అదే రహదారిలో రోడ్డు దాటుతుండగా పులిని చూసినట్లు చెబుతున్నాడు. 14వ తేదీన పాఠశాల సమీపంలో ఓ బాలుడు 40 మీటర్ల దూరంలో పులిని చూసి పరుగులు తీశాడు. దీంతో ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. కాలి వేలిముద్రలతో మొదలైన ఆందోళన దిబ్బల పాలెం రహదారి నుంచి కౌలువాడ వెళ్లే రహదారిలో చిరుత పులికి సంబంధించిన వేలిముద్రలను చూశారు. గురువారం రాత్రి సంచరించినట్లుగా అనుమానిస్తున్నారు. పులి పిల్లలకు సంబంధించిన చిన్న కాలి వేలు ముద్రలు కూడా ఉండడంతో ఈ రహదారిలో రాకపోకలు చేసేవారి తో పాటు సమీప ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. పులి తిరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లోనూ గ్రామస్తులు ప్రచారం చేస్తున్నారు. ఈ రహదారిని ఆనుకునే విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతుండడంతో అందులో పని చేస్తున్న సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కాలి వేలిముద్రలు నిర్ధారించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

➡️