నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి ఘనస్వాగతం

ప్రజాశక్తి-రంపచోడవరం : నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి నియోజకవర్గానికివచ్చిన ఎమ్మెల్యేకు రంపచోడవరంలోని సీతపల్లి బాపనమ్మ తల్లి ఆలయం వద్ద తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తీన్మార్లు ,గిరిజన సాంప్రదాయ రేలా నత్యాలు, కొమ్ము డాన్సులతో ఘన స్వాగతం పలికారు.అనంతరం బాపనమ్మ ఆలయ కమిటీ ఆలయ లాంఛనలతో ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతులను ఆలయంలో తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే దంపతులకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. రంపచోడవరం అంబేద్కర్‌ సెంటర్‌ కు చేరుకున్న ఎమ్మెల్యే దంపతులు అక్కడున్న అంబేద్కర్‌,ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తనను బిడ్డలా భావించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా నమ్మి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి అంటే ఇలా ఉండాలనే విధంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.. నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా దందాలకు పాల్పడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలను పార్టీలకతీతంగా, కుల,మత బేధాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తానన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఇప్పుడు ప్రజల వద్దకే ప్రజా పాలన వచ్చిందని, దానికి తాను వారధిగా ఉంటానని భరోసానిచ్చారు. అంబేద్కర్‌ సెంటర్లో టిడిపి నాయకులు అభిమానులు ఎమ్మెల్యే దంపతులను గజమాలతో సత్కరించారు. రంపచోడవరం నుండి ప్రారంభమైన ర్యాలీ గంగవరం అడ్డతీగల మీదుగా రాజవొమ్మంగి వరకు కొనసాగింది. 11 మండలాల నుంచి కూటమి పార్టీల నాయకులు,,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

➡️