Jammu and Kashmir ఎన్‌కౌంటర్‌- ముగ్గురు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. దోడా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దోడా జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కొనిఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఈ ఉగ్రవాదులే ఇటీవల భారత సైన్యంపై కాల్పులు జరిపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవల వరుస దాడులకు పాల్పడుతున్నారు. దీంతో దోడా, రాజౌరీ, పూంచ్‌ ప్రాంతాల్లో తనిఖీలు, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ నెల 11న భద్రతా దళాలపైఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులతో పాటు ఓ పోలీసు అధికారి తీవ్ర గాయాలపాలయ్యారు. మరో ఘటనలో పోలీస్‌ క్యాంపుపైనా దాడులు చేశారు. మరోవైపు భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌ కోట్‌ జిల్లాలోనూ భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడా హైఅలర్ట్‌ ప్రకటించారు.

➡️