శిలాఫలకానికే పరిమితం

May 23,2024 20:49

ప్రజాశక్తి – వేపాడ : మండలం కేజీపూడి రెవెన్యూ పరిధిలో ఇందిర జలప్రభ అభివృద్ధి పథకం ద్వారా నిధులు మంజూరు చేసి గిరిజన గ్రామాల్లో 100 ఎకరాలకు బోర్లు ద్వారా సాగునీటిని అందించాలని 2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం శిలాఫలకం ఏర్పాటు చేసింది. అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శిలాఫలకాన్ని ఆవిష్కరించి రూ.కోటితో సాగునీటి బోర్లు ఏర్పాటు చేసి గిరిజన రైతులకు అందిస్తామని చెప్పారు. అప్పటి నుంచి నేటి వరకూ శిలాఫలకం తప్ప బోర్లు ఎక్కడా వేయలేదు. దీంతో గత 15 సంవత్సరాలుగా గిరిజనులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. 2011 తరువాత మరోసారి జరిగిన ఎన్నికల్లో 2014లో కూడా కోళ్లలలితకుమారి ఎమ్మెల్యేగా విజయం సాధించినా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. 2019లో వైసిపి నుంచి కడుబండి శ్రీనివాసరావు గెలిచినా ఆయన కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. పదవులు పొందడమే తప్ప ఈ పథకం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరూ సాహసించలేదు. మంత్రి బొత్స సత్యనా రాయణ కూడా ఇటువైపు కన్నెత్తి చూడ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని కల సమయంలో గిరిజనులు మా ఆడపడుచులు, అన్నదమ్ములని చెప్పే నాయకులు వారి అభివృద్ధికి మాత్రం కృషి చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇందిర జలప్రభ పథకం ద్వారా బోర్లు తవ్వించి సాగునీటిని రైతులకు అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అభివృద్ధికి నోచుకోని దబ్బిరాజుపేట చెరువుమండలంలో దబ్బిరాజుపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో దబ్బిరాజుపేట చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో టిడిపి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రూ.97.40 లక్షలు జిల్లా జల వనరుల శాఖ నుంచి చెరువు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. 2019 జనవరిలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ పనులు ముందుకు కల్లేదు. ఈ లోగా ఎన్నికలు రావడంతో ఆమె ఓటమి చెంది వైసిపి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధికారంలోకి వచ్చారు. ఈయన ఈ చెరువు ఊసే ఎత్తలేదు. ఈ చెరువు అభివృద్ధి చేస్తే దబ్బిరాజుపేట, వల్లంపూడి, ఆతవ, ఎఎస్‌ పేట గ్రామాల ఆయకట్టు రైతులకు పుష్కలంగా పంటలు పండించుకునే అవకాశం కలిగేది. ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం దృష్టి సారించి చెరువును అభివృద్ధి చేసి తద్వారా రైతులకు సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.

➡️