ఏజెన్సీలో విజృంభిస్తున్న మలేరియా

May 23,2024 21:10

ఏజెన్సీలో వైరల్‌ జ్వరాలు, మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రోగులతో సీతంపేట ఏరియా ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఎపిడమిక్‌ సీజన్‌ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ, ఎన్నడూ లేని వధంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగడం, దాంతోపాటు కొద్దిపాటి వర్షాలు కురవడం, అపారిశుధ్యంతో దోమలు పెరగడం, కలుషిత జలాలు తాగడం వల్ల వైరల్‌ జ్వరాలు, మలేరియా బారిన పడుతున్నారు. దోమతెరలు పంపిణీ చేసినా, మలాథియన్‌ స్ప్రేయింగ్‌ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు.

ప్రజాశక్తి-సీతంపేట:  ఏజెన్సీలో మలేరియా, వైరల్‌ జ్వరాలు చాప కింద నీరులా ప్రబలుతున్నాయి. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో రోజుకు ఈ సీజన్లో 300 వరకు ఒపి పెరిగింది. వీటిలో సుమారు 15 మంది వరకు వైరల్‌, 5 వరకు మలేరియా కేసులు నమోదవుతున్నాయి. సీతంపేట మండలంలో గడ్డికారెం గ్రామానికి చెందిన ప్రణీత్‌, సంతోషి, నిమ్మక వైష్ణవి, లాడకు చెందిన ఆరిక భాస్కరరావు, మానాపురానికి చెందిన అప్పలమ్మ, బోడయ్య, కొత్తూరుకు చెందిన తిరుపతిరావు, హడ్డుబంగి పనసగూడకు చెందిన సవర తిరుపతిరావుకు మలేరియా పాజిటివ్‌ నమోదైంది. గత మూడు రోజులుగా ఈ కేసులు నమోదయ్యాయి. వీరికి సీతంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే కొన్ని మలేరియా కేసులను డిశ్చార్జి చేశారు. గతేడాది ఇదే సీజన్లో దోనుబాయి పరిసర ప్రాంతాల్లో అధికంగా మలేరియా కేసులు నమోదయ్యాయి. గత నెలలో మర్రిపాడు, పూతికవలస పరిసర ప్రాంతాల నుంచి మలేరియా కేసులు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఎండ వేడిమి తట్టుకోలేక, కలుషిత నీరు తాగడంతో వైరల్‌ జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. దీంతో ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా మలేరియా కేసులు వస్తున్నాయని, వీరికి సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి భానుప్రతాప్‌ వద్ద ప్రస్తావించగా మలేరియా కేసులు నమోదైన చోట వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 16 నుంచి పిచికారీ చేస్తున్నామని, దోమతెరలు పంపిణీ చేశామని తెలిపారు. వైద్య సిబ్బంది ద్వారా సర్వే కూడా చేపడుతున్నామని వివరించారు. ఇప్పటికే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని సమాధానం ఇచ్చారు.జ్వరాలపై అప్రమత్తం ఏజెన్సీలో వ్యాప్తి చెందుతున్న వైరల్‌ జ్వరాలు, మలేరియా కేసులపై అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్‌ఒ విజయపార్వతి వైద్యులను ఆదేశించారు. గురువారం దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి మరణాలూ సంభవించకుండా చూడాలని ఆదేశించారు. జ్వరాలుంటే వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, పరీక్షలు చేయాలని సూచించారు. సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు భానుప్రతాప్‌, గిరీషా, హెల్త్‌ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు

➡️