ఆంధ్రా -ఒడిస్సా సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఉండాలి

Mar 23,2024 20:32

కురుపాం : రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ల వద్ద నిరంతరం పటిష్ట భద్రత నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని మంత్రజోల సమీపాన గల మూలిగూడ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ను కలెక్టర్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతానికి ఎన్ని కేసులు నమోదయ్యాయని, ఎంత మేరకు వాహనాలు సీజ్‌ చేసిన వివరాలను స్థానిక ఎస్సై ఎస్‌.షణ్ముఖరావును అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది కేసులు వరకు నమోదయ్యాయని, 490 లీటర్ల నాటు సారా పట్టుబడగా, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఫోర్‌ వీలర్‌ వాహనాన్ని సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌కు తెలిపారు. అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24 గంటలు నిరంతరం పటిష్ట నిఘాను పెట్టాలని సూచించారు. చెక్‌పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చెక్‌పోస్ట్‌ తనిఖీలను కంట్రోల్‌ రూమ్‌ నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. చెక్‌ పోస్ట్‌ నుంచి సీసీ కెమెరాలు పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విధమైన ఉదాసీనతను ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పాలకొండ ఆర్‌డిఒ ఎ.వెంకటరమణ, తహశీల్దార్‌ బి.శివశంకర్‌ సత్యనారాయణ, ఆర్‌ఐ కరుణాకరరావు, తదితరులు పాల్గొన్నారు.చెక్‌పోస్టు వద్ద రికార్డులను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

➡️