ఇక్కడ పుట్టడమే గిరిజనుల పాపమా?

Mar 31,2024 21:59

గుమ్మలక్ష్మీపురం: ఇక్కడ గిరిజనులుగా పుట్టడమే పాపమా. రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందలేకపోవడమే వీరి శాపమా. అందుకు కారణం ఆ పంచాయతీ నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామంగా ఉండటమే. వివరాల్లోకి వెళితే …గుమ్మలక్ష్మీపురం మండలం నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతం. అయినప్పటికీ దుడ్డుఖల్లు పంచాయతీ మాత్రం అందుకు భిన్నంగా నాన్‌ షెడ్యూల్డ్‌ పంచాయతీగానే పరిగణించబడింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఈ పంచాయతీలో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు గానీ, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు రిజర్వేషన్లు కోల్పోతున్నారు. ఐటిడిఎ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఎటువంటి వ్యవసాయ రుణాలు, బోరు బావులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందడం లేదు. దుడ్డుఖల్లు పంచాయతీ పరిధిలో 15 గ్రామాలు ఉన్నాయి. వీటిలో కొత్తవలస, బెల్లిడి, దొరజమ్ము, కంబగూడ, దొర కేక్కువ, కొల్లిగూడ, లోవలక్ష్మీపురం, విశ్వనాధపురం, దుడ్డుఖల్లు, బుడ్డెం ఖర్జ, మేదరగండ, పిల్లిగూడ, బొడ్లగూడ, చింతలపాడు తదితర గిరిజన గ్రామాలు నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలుగానే పరిగణించబడుతున్నాయి. నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ జాబితాలో చేర్చాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించిన నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పై గ్రామాల్లో నివసిస్తున్న వారు గిరిజనులుగా ఉన్నా రిజర్వేషన్ల ప్రక్రియ వీరిదరి చేరడం లేదు. దీంతో చదువుకున్న గిరిజన యువతీ, యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. గిరిజన రైతులకు ఎటువంటి వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ రాయితీలందక ప్రతి ఏటా అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. పంటలకు నష్టం వాటిల్లిన ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందడం లేదు. పక్కా గృహాలు లేవు. తాగునీటి సమస్య వెంటాడుతుంది. 1/70చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం వీరికి వర్తించదు.ఉపాధి అవకాశాల్లేవు…మా గ్రామం నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామంగా ఉండడంతో ఇక్కడ చదువు కున్న యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నాం. నేను డిగ్రీ చదువుకున్నా రిజర్వేషన్‌ లేక ఉద్యోగం రాక నిరుద్యోగిగా ఉన్నాను. ప్రభుత్వం స్పందించి మా గ్రామాన్ని షెడ్యూల్డ్‌ జాబితాలో చేర్చాలి.బిడ్డిక సంధ్యశ్రీ,గిరిజన యువతి దుడ్డుఖల్లు. ప్రభుత్వ రాయితీలకు దూరందుడ్డుఖల్లు పంచాయతీ నాన్‌ షెడ్యూల్డ్‌గా ఉండడంతో ఈ పంచాయతీలో ప్రజలు ప్రభుత్వ రాయితీలకు దూరంగా ఉన్నారు. ఐటిడిఎ ద్వారా ఎటువంటి రుణాలందడం లేదు. దీంతో పూర్తిగా వెనుకబడి ఉన్నాం. ఇక్కడ పుట్టడమే పాపమా?.కొండ గొర్రి గోపాలరావు గిరిజన యువకుడు, దుడ్డుఖల్లు.షెడ్యూల్డ్‌ జాబితాలో చేర్చాలి దుడ్డుఖల్లు పంచాయతీ నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామం గా ఉండడంతో రాజ్యాంగం కల్పించిన హక్కులు గిరిజనులకు అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగానికి రిజర్వేషన్‌ దూరమైంది. ఏళ్ల నాటి సమస్యను ప్రభుత్వం గుర్తించి షెడ్యూల్డ్‌ పరిధిలోకి తీసుకొస్తే యువత, మహిళలు, రైతుల అభివృద్ధికి అవకాశం ఉంటుంది.పి.తిరుపతిరావు, సిపిఎం మండల నాయకులు.నేటికీ వెనుకబాటేమండలంలోని 27 పంచాయతీలుండగా అందులో 26 పంచాయతీలు షెడ్యూల్‌, ఒక్క దుడ్డుఖల్లు పంచాయతీ నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామంగా ఉండడంతో గిరిజనులు నేటికీ దుర్భర జీవనం గడపకు తప్పడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీరి దరికి చేరడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి దుడ్డుఖల్లు ను షెడ్యూల్‌ గ్రామంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నిమ్మక సింహాచలం, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు.

➡️