పిట్టల్లా రాలిపోతున్నారు..

Feb 18,2024 21:01

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువుకోడానికి వచ్చిన విద్యార్థులు ఏదో ఒక కారణంచేత పసిప్రాయంలోనే మృత్యుఒడికి చేరుతూనే ఉన్నారు. విద్యార్థులు మరణించిన సందర్భంలో మాత్రమే జిల్లా ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా సమీక్షలు జరిపి, హడావిడిగా ఆ రెండురోజులు పాఠశాలలను సందర్శించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో అయితే నెల రోజుల్లో నాలుగైదు ఆశ్రమ పాఠశాలలను డిడి, పిఒ సైతం అధికారులు సందర్శించే సందర్భాలు ఉండేవి. విద్యార్థుల మరణాలు అరికట్టడం, వారి మరణాలకు గల కారణాల వంటి వాటిపై విశ్లేషణ పూర్తిగా కొరవడింది. దీంతో విద్యార్థులు ఏడాది పొడవునా ఏదో ఒకచోట చనిపోతూనే ఉన్నారని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు నెలల్లో ముగ్గురు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మృతి చెందడం బాధాకరం. రక్తహీనత, జ్వరం వంటి లక్షణాలతో విద్యార్థులు మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు.ఉన్నత చదువులు చదవాలని, ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని కన్న ఆ గిరిజన విద్యార్థులు కలలు కలలుగానే మిగిలిపోయాయి. చదువుకునే పసి ప్రాయంలో వివిధ వ్యాధులతో అనారోగ్యం బారిన పడి నిండు నూరేళ్లు జీవించాల్సిన పసి మొగ్గలు పదహారేళ్లకే మృత్యుఒడికి చేరుతున్నారు. దీంతో ఆ ఇంట విషాదాన్ని నింపుతున్నారు.జిల్లాలో మక్కువ మండలం ఎర్రసామంత వలస ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థి సీదరపు అశోక్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈనెల 4న పాచిపెంట ఆశ్రమ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ఎన్‌.శ్వేత, గుమ్మలక్ష్మీపురం మండలం కెడి కోలని ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బిడ్డిక సీత అనారోగ్యంతో మృతి చెందింది.వైద్యం కోసం…..పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఉన్న 55 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సీతంపేట ఐటిడిఎ పరిధిలోని 43 ఆశ్రమ పాఠశాలల్లో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. నిత్యం విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతూ సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లడం పరిపాటిగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యం కోసం వస్తున్న వారిలో ఎక్కువమంది విద్యార్థులే కనిపిస్తున్నారు. వసతి గృహాల్లో ఆరోగ్య కార్యకర్తల పోస్టుల్లేక పోవడంతో విద్యార్థులు వైద్యం కోసం బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు.ఆసుపత్రుల్లో వైద్య సేవలు అంతంత మాత్రమే…. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగుపడలేదు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా రోగులకు అన్ని రకాలైన వసతులు కల్పించడంలో మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో వైద్యం అందని ద్రాక్ష గానే మిగిలిపోతుంది.ఆరోగ్య సిబ్బందిని నియమించాలిపార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వాలంటీర్లను ప్రభుత్వం నియమించాలి. విద్యార్థులకు వైద్య సేవలందేలా చూడాలి. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి. వారానికోసారి వైద్య శిబిరాలు నిర్వహించాలి. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి.పల్ల సురేష్‌గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి.

➡️