సచివాలయ వ్యవస్థ పటిష్టతకే శిక్షణ

Dec 12,2023 22:06

గుమ్మలక్ష్మీపురం : సచివాలయాల వ్యవస్థను పటిష్టపర్చేందుకు గానూ ఆ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎపిఎస్‌ఐఆర్‌డి (పంచాయతీరాజ్‌ శాఖ) డైరెక్టర్‌ జె.మురళి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక వైటిసిలో సచివాలయాల సిబ్బంది, గ్రామ వాలంటీర్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలకు వచ్చే ప్రజల ప్రవర్తన తెలుసుకొని బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం ఈ శిక్షణను ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల్లో ఏమైనా సాంకేతిక లోపాలుంటే తమకు సమాచారం అందించాలన్నారు. రాష్ట్రంలో మొదటి విడతగా ఆరు ఐటిడిఎల పరిధిలో గల 43 మండలాల్లో 20వేల మంది గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణను అందిస్తున్నామని అన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమ విధుల నిర్వహణ, గోల్డ్‌ అచీవ్మెంట్‌ తదితర విషయాలపై పూర్తిగా అవగాహన కల్పించుకోవాలన్నారు. ప్రతి సచివాలయ ఉద్యోగి టీం వర్క్‌ చేసుకొని విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు గ్రామ సచివాలయ సిబ్బంది వ్యక్తిగతంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేలా మెడిటేషన్‌ (ధ్యానం)పై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో హార్టిఫుల్‌ నెస్‌ మెడిటేషన్‌ ఇనిస్ట్యూట్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ (ఎన్జీవో) లక్ష్మణరావు, జిల్లా కోఆర్డినేటర్‌ జెవిఎస్‌ఎన్‌ రాజు, శిక్షకులు జె.సుధారాణి, ఇన్చార్జి ఎంపిడిఒ జగదీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కురుపాం : ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించే బాధ్యత సచివాలయ సిబ్బందిదేనని ఎపి ఎస్‌ఐఆర్‌డిపిఆర్‌ డైరెక్టర్‌ జె.మురళి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ కార్యాలయ ప్రాంగణంలో ఎంపిడిఒ జి.రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సచివా లయ సిబ్బంది వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామాల్లో సచివాలయ పరిధిలో గల ప్రజలకు సచివాలయ విధివిధానా లపై అవగాహన కల్పిస్తూ పథకాలు అందేలా చూసే బాధ్యత సిబ్బందేనన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యంగా గ్రామ సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పని చేయాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మంగళవారం ఐటిడిఎ పరిధిలోని మండలాల గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు గిరిమిత్ర భవనంలో నిర్వహిస్తున్న రిఫ్రెషర్‌ ట్రైనింగ్‌ కోర్స్‌లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుల, మత వర్గ వర్ణ పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ అందించాలన్నదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పని చేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బలగ రేవతమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణి, ఎఎంసి చైర్‌పర్సన్‌ ఎం.భాగ్యశ్రీ, వైస్‌ ఎంపిపిలు సిద్ధా జగన్నాధరావు, బంకురు రవికుమార్‌, సర్పంచ్‌ బంగారమ్మ, జెసిఎస్‌ కన్వీనర్‌ బి.వాసుదేవరావు, సీనియర్‌ నాయకులు శేఖర్‌, ఎంపిడిఒ అకీబ్‌ జావేద్‌, కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️