శిథిల వ్యవస్థలో ప్రభుత్వ కార్యాలయాలు

Jun 30,2024 21:41

ప్రజాశక్తి – వీరఘట్టం : మండలంలో పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిన రెండు దశాబ్దాలు దాటక ముందే శిథిలావస్థకు చేరాయి. దీంతో వీటిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, పాఠాలు బోధిస్తున్నా ఉపాధ్యాయులు, అలాగే కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. మండలంలోని చిట్టిపూడివలస, రేగులపాడు, బొడ్లపాడు, పనస నందివాడ తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శిథిలావ్యవస్థకు చేరుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ ఈ భవనాలు అక్కడక్కడ శ్లాబ్‌ పెచ్చులూడి దర్శమిస్తున్నాయి. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా శ్లాబ్‌ పై నుంచి వర్షం నీరు కిందకు జారడంతో గోడల బీటలు వారుతున్నాయి. పెద్దూరు, బొడ్లపాడు, కంబర వలస, సందిమానుగూడ, వీరఘట్టం తదితర గ్రామాల్లో పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికే బొడ్లపాడు గ్రామ పాఠశాల వెనుక గోడ కూలిపోవడంతో అద్దె భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఓ భాగంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం కొనసాగుతుంది. తూడిలో శిథిలమైన భవనంలో పశు వైద్యశాల కొనసాగుతుంది. ప్రతిసారి వర్షం పడినప్పుడు వర్షం నీరు కిందకి జారి పడడంతో పశువులు, మేకలు, తదితర జంతువులకు సంబంధించిన విలువైన మందులు పాడవుతున్నట్లు ఇన్‌ఛార్జి పశు వైద్యాధికారి పి.చైతన్య శంకర్‌ విలేకరుల వద్ద వాపోతున్నారు. ప్రస్తుత భవనాలు శిథిలావ్యవస్థలో చేరుకోవడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాద వార్త వినాల్సి వస్తుందని ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు అటు ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిథిలమైన భవనాలను తొలగించి వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

➡️