అక్రమ అరెస్టులపై ఆగ్రహం

Jan 22,2024 19:38

అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులు, అంగన్వాడీలు

 అక్రమ అరెస్టులపై ఆగ్రహం
– అంగన్వాడీలను వదలిపెట్టాలని ర్యాలీ
– ప్రధాన రహదారిపై బైఠాయింపు, ఆందోళన
– మద్దతుగా పాల్గొన్న సిపిఎం, సిఐటియు నాయకులు
– అంగన్‌వాడీలను వదలిపెట్టిన పోలీసులు
అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం రోజురోజుకు పెరిగిపోతోంది. అంగన్వాడీల సమ్మెను ఎలాగైనా విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా హెచ్చరిస్తుంది. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్‌వాడీలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడ అరెస్టు చేయించి బెదిరింపులకు పాల్పడుతోంది. అయినా అంగన్వాడీలు మొక్కవోని దీక్షతో తమ హక్కుల సాధనకు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగాల నుండి తమను తొలగిస్తే ప్రభుత్వం కొరివితో తల గోక్కున్నట్లేనని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
చలో విజయవాడ కార్యక్రమానికి ఆదివారం రాత్రి నంద్యాల పట్టణం నుండి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లో, ఫంక్షన్‌ హల్‌లో నిర్భంధించారు. ప్రభుత్వ, పోలీసుల దమన కాండను నిరసిస్తూ సోమవారం అంగన్‌వాడీలు, సిపిఎం, సిఐటియు నాయకులు నంద్యాలలోని మున్సిపల్‌ కార్యాలయం నుండి రాజారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు బైటాయించి ఆందోళన చేపట్టారు. రూ. 26 వేలు వేతనం పెంచాలని, ఆదివారం రాత్రి అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని నినదించారు. దీంతో నంద్యాల నుండి కర్నూలు, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల వెళ్లే రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌ స్థంభించి పోయింది. దీంతో చేసేదేవిమీలేక పోలీసులు అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను వదిలిపెట్టారు. అంతకుముందు జరిగిన ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టులు చేసి ఫంక్షన్‌ హాళ్లలో, రైల్వే స్టేషన్‌లలో పోలీసులు నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తీరు మారకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా గత 42 రోజులుగా అంగన్వాడీలు కనీస వేతనం అమలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని నిరవధిక సమ్మె చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసి, చివరకు బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. 42 రోజులుగా మహిళలు రోడ్లు ఎక్కాల్సిన దుస్థితిని తీసుకురావడం దుర్మార్గమన్నారు. జగన్‌కు అధికారం ఉందని సమస్యలను పరిష్కారం చేయకుండా, విజయవాడకు వెళ్లకుండా ఎక్కడికెక్కడ మహిళలను అర్థరాత్రిలు స్టేషన్లో ఉంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా భయభ్రాంతులకు గురి చేయడం పద్ధతి కాదన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మధ్దులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌, కే మహమ్మద్‌ గౌస్‌ , కోశాధికారి పి.వెంకట లింగం, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు నాగరాణిలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేసేంతవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, వైసిపికి పుట్టగతులు లేకుండా చేస్తామని, జగన్‌ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️