పెట్రేగిపోతున్న క్షుద్ర మాంత్రికులు

Feb 18,2024 17:27

క్షుద్ర పూజలు జరిగినచోట పడి ఉన్న వస్తువులు

పెట్రేగిపోతున్న క్షుద్ర మాంత్రికులు
– గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు
– భయాందోళన చెందుతున్న గ్రామీణ వాసులు
ప్రజాశక్తి – రుద్రవరం
నాగరికత అభివృద్ధి చెంది, చంద్రుడు, ఇతర గ్రహాలపై మానవుడు అడుగుపెడుతున్న ఈ రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. మండలంలోని పలు గ్రామాలలో రాత్రి సమయాలలో క్షుద్ర పూజలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. గత పది రోజుల వ్యవధిలోనే ముత్తలూరు గ్రామంలోని పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు జరిగాయి. 2 రోజుల క్రితం మండల కేంద్రం రుద్రవరంలోని ఓ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారు. నేడు ఆదివారం మండలంలోని రెడ్డిపల్లె, తువ్వపల్లి గ్రామాల మధ్య ఉన్న స్మశానం సమీపంలోని రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగాయి. క్షుద్ర పూజలు జరిగిన చోట నిమ్మకాయలు, పసుపు కుంకుమ, మద్యం సీసాలు, తినుబండారాలు, మల్లెపూలు, ముగ్గులు వేసి ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజలు సంచరించే మార్గమధ్యలో ఇలా క్షుద్ర పూజలు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు మండలంలోని కొన్ని గ్రామాలలో క్షుద్ర పూజలు జరుగుతూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు రాత్రి సమయాలలో బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇలా క్షుద్ర పూజలు జరిపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వారిని పోలీస్‌ అధికారులు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

➡️