రాబోయే ఎన్నికల్లో భూమా కిషోర్‌ రెడ్డికే మా మద్దతు

Jan 30,2024 16:58

భూమా కిషోర్‌ రెడ్డి తో కలిసి మాట్లాడుతున్న భూమా కుటుంబ సభ్యులు

రాబోయే ఎన్నికల్లో భూమా కిషోర్‌ రెడ్డికే మా మద్దతు
– విజయ మిల్క్‌ డైరీ మాజీ చైర్మన్‌ భూమా నారాయణ రెడ్డి
– ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తా : భూమా కిషోర్‌ రెడ్డి
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
రానున్న ఎన్నికల్లో మా కుటుంబం మద్దతు భూమా కిషోర్‌ రెడ్డికే అని విజయ మిల్క్‌ డైరీ మాజీ చైర్మన్‌ భూమా నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం భూమా కిషోర్‌ రెడ్డి స్వగృహంలో భూమా కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కుటుంబ సభ్యులంతా కలిసి భూమా కిషోర్‌ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. భూమా కిషోర్‌ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భూమా కుటుంబం ఎలా వెళ్లాలో నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డ ప్రజలకు కూడా కన్ఫ్యూజన్‌గా ఉందని, రాబోయే ఎన్నికల్లో భూమా కుటుంబం అంతా తన వెంటే ఉంటారని, వారి మద్దతు తనకే అని స్పష్టం చేశారు. అఖిలప్రియ వ్యవహార శైలితోనే భూమా కుటుంబం పరువు దిగజారిందని ఆరోపించారు. 2019లో తాను భూమా కుటుంబ సభ్యులందరితో మాట్లాడే బిజెపిలో చేరానన్నారు. నాటి నుండి ఆళ్లగడ్డ తాలూకాలో బిజెపిని బలోపేతం చేశామన్నారు. ఫిబ్రవరి 5 లేదా 7వ తేదీ నుండి ఆళ్లగడ్డ నుంచి బిజెపి తరఫున ప్రచారం చేస్తామన్నారు. పొత్తులనేది పార్టీ నిర్ణయమన్నారు. భూమా అఖిలప్రియ వెంట క్యాడర్‌ ఎవరు లేరన్నారు. పొత్తులో భాగంగా తనకు సీటు రాకపోయినా ఆళ్లగడ్డ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. ఏదేమైనా భూమా కుటుంబ వారసుడిని తానేనని, మద్దూరి అఖిలప్రియ, భార్గవ రామ్‌తో సంబంధం లేదన్నారు. భూమా నాగిరెడ్డి చెల్లెలు దేవి, మహేశ్వరి, వీరభద్ర రెడ్డి, భూమా మహేశ్వర్‌ రెడ్డిలు మాట్లాడుతూ భూమా కిషోర్‌ రెడ్డి కే తమ పూర్తి మద్దతు అన్నారు. ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేసిన మద్దతు ఉంటుందన్నారు. భూమా కుటుంబ అల్లుడు కాటసాని రఘునాథరెడ్డి తాను పంపిన వీడియోలో మాట్లాడుతూ భూమా కిషోర్‌ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

➡️